కాజ‌ల్‌కు తీర‌ని అన్యాయం చేశారుగా..

కాజ‌ల్‌కు తీర‌ని అన్యాయం చేశారుగా..

‘రణరంగం’ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన కాజల్ అగర్వాల్‌కు మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాలో మీ కంటే కళ్యాణి ప్రియదర్శన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లుందిగా.. ఇలాంటి సినిమా ఎందుకు ఎంచుకున్నారు అని. దానికామె బదులిస్తూ.. ‘రణరంగం’ కథ మలుపు తిరిగేది తన పాత్ర వల్లే అని.. తాను ఎందుకు ఈ పాత్ర ఎంచుకున్నానో సినిమా చూశాక అర్థమవుతుందని అంది.

కానీ తీరా చూస్తే కాజల్ మాటలు ఉత్త కబుర్లే అని అర్థమైంది. సినిమాలో కాజల్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఒక పాటలో గ్లామర్ ఒలకబోయడం మినహా ఆమె చేసిందేమీ లేదు. కథలో ఆమెది కరివేపాకు లాంటి పాత్రే. ద్వితీయార్ధంలో అయితే ఆమె పాత్ర పూర్తిగా తేలిపోయింది. గ్లామర్ పరంగా కూడా ఆమె ఆకట్టుకోలేకపోయింది.

కాజల్ పాత్రను ఇలా తయారు చేసి పెట్టారేంటి అంటూ ‘రణరంగం’ పోస్ట్ రిలీజ్ సక్సెస్ మీట్లో శర్వానంద్‌ను అడిగితే.. సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. కాజల్ పాత్ర సినిమాలో చూసిందానికంటే చాలా ఉందని.. ఐతే నిడివి సమస్య వల్ల కొన్ని సన్నివేశాలు తీసేయాల్సి వచ్చిందని చెప్పాడు శర్వా. ఇందులో ఎంత వరకు నిజముందో కానీ.. ఏ రకంగా చూసినా ‘రణరంగం’ దర్శకుడు సుధీర్ వర్మ కాజల్‌కు చాలా అన్యాయమే చేశాడని చెప్పుకోవాలి.

నిజానికి శర్వాతో పోలిస్తే కాజల్ రేంజ్ ఎక్కువ. ఈ మధ్య కొంచెం స్థాయి తగ్గించుకుని మీడియం రేంజి హీరోల పక్కన నటిస్తున్న కాజల్.. శర్వాతో కూడా జతకట్టింది. ఐతే ‘ఎమ్మెల్యే’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘సీత’ లాంటి తన స్థాయికి తగని సినిమాల్లో చేసినా అందులో కాజల్ పాత్ర కీలకం. కానీ ‘రణరంగం’లో మాత్రం ఆమెను తేల్చిపడేశారు. కాజల్ కోసం వస్తే ఆమె ఎందుకు ఈ సినిమాలో ఉందో కూడా అర్థం కాలేదని ‘రణరంగం’ చూసిన ఓ అభిమాని ఛానెల్ మైక్ ముందు వాపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English