‘పాగల్’ అవుతున్న ‘ఫలక్‌నుమాదాస్’

‘పాగల్’ అవుతున్న ‘ఫలక్‌నుమాదాస్’

‘ఫలక్‌నుమా దాస్’ ఫలితం ఎలా ఉన్నా.. ఈ సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో.. ప్రమోషన్లలో విశ్వక్సేన్ చేసిన అతి వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్ దేవరకొండను పరోక్షంగా విమర్శించడం.. వేరే ఇష్యూస్ మీద దూకుడుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. దీని వల్ల సినిమాకు జరిగిన మంచి కంటే చెడే ఎక్కువ అని రిలీజ్ తర్వాత కానీ అర్థం కాలేదు.

కుర్రాడికి మరీ పొగరెక్కువైందన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమైంది. ఓ మోస్తరుగా అనిపించే సినిమాపై చాలా నెగెటివిటీ వచ్చేసింది సోషల్ మీడియాలో. మొత్తానికి ఆ సినిమా విషయంలో విశ్వక్సేన్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ‘ఫలక్‌నుమా దాస్‌’కు సీక్వెల్ చేస్తా అని చెప్పిన విశ్వక్సేన్ దాని సంగతేదీ తేల్చకుండా ఇప్పుడు వేరే సినిమాకు కమిటయ్యాడు.

నరేష్ రెడ్డి కుప్పిలి అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో ‘పాగల్’ అనే సినిమా చేయబోతున్నాడు విశ్వక్సేన్. ‘సినిమా చూపిస్త మావ’, ‘హుషారు’ లాంటి సినిమాలతో పేరు సంపాదించిన బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘పాగల్’ అనే టైటిల్ చూస్తే మరోసారి హైదరాబాద్ అర్బన్ నేటివిటీతో సినిమాను లాగించబోతున్నట్లున్నాడు విశ్వక్సేన్. మళ్లీ తన యాటిట్యూడ్ చూపించడానికి తగ్గట్లే ఉంది సినిమా టైటిల్.

ఈ సినిమాకు స్క్రిప్టులోనూ విశ్వక్సేన్ సహకారం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈసారైనా కొంచెం అణకువగా ఉండి సినిమా మీద నెగెటివిటీ రాకుండా చూసుకుంటాడేమో చూడాలి. ముందు అనుకున్న ప్రకారం అయితే నాని నిర్మాణంలోనూ విశ్వక్సేన్ ఓ సినిమా చేయాలి. కానీ ఈ సినిమా మాటలకే పరిమితం అయినట్లుంది. ‘పాగల్’ ఏమైనా ఆడితే.. ఆ తర్వాత దీని గురించి.. ‘ఫలక్‌నుమా దాస్-2’ గురించి విశ్వక్ ఆలోచిస్తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English