రాధా రాన‌న్నారు.. ఇక సీన్ రివ‌ర్స్‌!

రాజ‌కీయాల్లో ఎవ‌రూ చిర‌కాల మిత్రులుగా.. శాశ్వ‌త శ‌త్రువులుగా ఉండ‌ర‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అవ‌కాశాల‌ను బ‌ట్టి ప్ర‌యోజ‌నాల మేర రాజ‌కీయ నాయ‌కులు పార్టీలు మారుతుంటారు. దీంతో అప్ప‌టివ‌ర‌కూ వెన‌కేసుకొచ్చిన మిత్రుడిపై ఒక్క‌సారిగా రెచ్చిపోవాల్సి ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కూ శ‌త్రువుగా చూసిన నాయ‌కుడిపై ఒక్క‌సారిగా ప్రేమ ఒల‌క‌బోయాల్సి ఉంటుంది. ఇది రాజ‌కీయ పార్టీల‌కు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ కూడా ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాను వైసీపీ నాయ‌కులు ల‌క్ష్యంగా చేసుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చేర్చుకుందామ‌నుకుంటే..
విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి రాధాకు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గం నేత‌గా బ‌ల‌మైన పేరుంది. అందుకే ఆయ‌న్ని పార్టీలోకి తీసుకుంటే కాపు ప్ర‌జ‌ల ఓట్లు ప‌డ‌తాయ‌న్న‌ది పార్టీల వ్యూహం. తాజాగా టీడీపీలో ఉన్న రాధాను వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అందుకు రాధాకు స‌న్నిహితులైన కొడాలి నాని, వంశీ విఫ‌ల య‌త్నం చేసిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో వైసీపీలో కొన‌సాగిన రాధాకృష్ణ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. అందుకు చాలా కార‌ణాలున్నాయి. పార్టీలో త‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న టీడీపీలోకి వ‌చ్చేశారు. అప్ప‌టినుంచి త‌న పాత మిత్రుడైన రాధాను వైసీపీలోకి తిరిగి తెచ్చేందుకు కొడాలి నాని తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. రాధా పార్టీలోకి వ‌స్తే విజ‌య‌వాడ తూర్పు, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు కృష్ణ జిల్లా కాపుల ఓట్లు త‌మ పార్టీకి ప‌డ‌తాయ‌న్న‌ది వైసీపీ వ్యూహం. అందుకే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వంగ‌వీటి రంగా విగ్ర‌హం ఏర్పాటు చేసిన దాని ఆవిష్క‌ర‌ణ‌కు రాధాను ఆహ్వానించారు.

ఆ ట్వీస్ట్‌..
ఆ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన రాధా త‌న హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని రెక్కీ కూడా నిర్వ‌హించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన కొడాలి నాని రాధాను పార్టీలోకి తెచ్చేందుకు ఇంత‌కంటే మంచి స‌మ‌యం ఉండ‌ద‌ని సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. దీంతో 24 గంట‌ల్లోనే రాధాకు 2 ప్ల‌స్ 2 గ‌న్‌మెన్ల సెక్యురిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. కానీ వైసీపీ పార్టీకి రాధా షాకిచ్చారు. త‌న‌కు ప్ర‌భుత్వం ఇస్తాన‌న్న భ‌ద్ర‌త‌ను వ‌ద్ద‌న్నారు. అంతే కాకుండా టీడీపీ, కాపు నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాజాగా రాధా ఇంటికి చంద్ర‌బాబు వెళ్ల‌డంతో ఆయ‌న ఇక వైసీపీలో చేర‌ర‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పటివ‌ర‌కూ వెన‌కేసుకొచ్చిన వైసీపీ.. ఇప్పుడు రాధాపై అటాక్ చేయ‌డం మొద‌లెట్టింది. అందులో భాగంగానే విజ‌య‌వాడ సీపీ క్రాంతి రాణా ప‌దే ప‌దే మీడియా ముందుకు వ‌చ్చి రాధా రెక్కీ వ్య‌వ‌హారంలో ఎలాంటి ఆధారాలు దొర‌క‌లేద‌ని రాధా వ‌ద్ద‌న్నా భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని చెబుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా రాధాపై విమ‌ర్శ‌ల‌కు దిగారు. రాధాకు అంత సీన్ లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రిని హ‌త్య చేసిన పార్టీలో రాధా ఎలా కొన‌సాగుతార‌ని ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల్లో రాధాను అంద‌రూ మ‌ర్చిపోయార‌న్నారు. మెయిన్ రోడ్డులో ఉన్న రాధా ఇంటి ముందు కారు తిరిగితే అది రెక్కీనా అని నిల‌దీశారు. దీంతో రాధాపై వైసీపీ రివ‌ర్స్ గేరు వేసింద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంద‌ని నిపుణులు అంటున్నారు.