సంపూ.. హృదయ విజేత

సంపూ.. హృదయ విజేత

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ది చాలా చిన్న స్థాయి. కానీ అతడి మనసు మాత్రం పెద్దదని పలు సందర్భాల్లో రుజువైంది. ఆంధ్రాలో వరదలు వచ్చినపుడు.. ఇంకా కొన్ని సందర్భాల్లో ఉడతా భక్తిగా తన వంతుగా విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. స్వతహాగా తెలంగాణ వాడైనప్పటికీ  వైజాగ్‌కు వెళ్లి మరీ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్నాడు. అరెస్టు కూడా అయ్యాడు. ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నట్లు కాకుండా జెన్యూన్‌గా స్పందించినట్లు కనిపిస్తాడు సంపూ. ఇప్పుడతను మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

కర్ణాటకలో వరదల కోసం అల్లాడుతున్న జనాల్ని ఆదుకోవడానికి తన వంతుగా రూ.2 లక్షల విరాళాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించాడు సంపూ. దేశంలో వివిధ రాష్ట్రాల్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దక్షిణాదిన చాలా ఎక్కువగా నష్టపోతున్నది కర్ణాటక, కేరళ రాష్ట్రాలే.

ఐతే సంపూ కొంచెం వ్యూహాత్మకంగానే కర్ణాటకకు విరాళం ప్రకటించాడు. అతడి కొత్త సినిమా ‘కొబ్బరిమట్ట’ కొంచెం ఆలస్యంగా కర్ణాటకలో విడుదలవుతోంది. బెంగళూరు నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం డిమాండ్లు చేయడంతో రెండో వీకెండ్ నుంచి అక్కడ సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత సాయిరాజేష్. ఇలాంటి సందర్భంలో సంపూ కర్ణాటకకు విరాళం ప్రకటించడం విశేషం.

ఇందులో ప్రమోషనల్ స్ట్రాటజీ ఉంటే ఉండొచ్చు కానీ.. అయినప్పటికీ సంపూ పెద్ద మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అతనేమీ కోట్లు పారితోషకంగా తీసుకునే హీరో కాదు. సినీ పరిశ్రమలో అతనేమీ భారీగా సంపాదించేయలేదు. అయినా జనాలకు కష్టం వచ్చిన ప్రతిసారీ ఉడతాభక్తిగా తన వంతు సాయం చేస్తున్నాడు. కోట్లు పుచ్చుకునే హీరోలు ప్రతిసారీ ఇలా స్పందించని విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English