డైరెక్టర్ని నిందిస్తే ఏం లాభం?

డైరెక్టర్ని నిందిస్తే ఏం లాభం?

మన్మథుడు-2 బాక్సాఫీస్ కథ కంచికి చేరినట్లే. ఇప్పుడొస్తున్న షేర్ నామమాత్రం. థియేటర్ల రెంట్లను దాటి పెద్దగా బయ్యర్లకు మిగులుతున్నది లేదు. ఈ వీకెండ్ గురువారం నుంచే మొదలైపోతోంది. ఒకటికి రెండు కొత్త క్రేజీ సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ఇప్పుడున్న సినిమాల పోటీనే తట్టుకోలేకపోతున్న ‘మన్మథుడు-2’.. కొత్త చిత్రాల ధాటికి నిలవడం కష్టమే.

రూ.21 కోట్లకు ‘మన్మథుడు-2’ థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. అందులో సగం షేర్ దగ్గర సినిమా ఆగిపోయేలా ఉంది. కాబట్టి సినిమా డిజాస్టర్‌గా మిగులుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ ఫలితానికి బాధ్యులెవరు? మామూలుగా అయితే దర్శకుడే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కినేని అభిమానుల్లో సైతం కొందరు రాహుల్ రవీంద్రన్‌ను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. కానీ వేరే సినిమాల సంగతి వేరు కానీ.. ‘మన్మథుడు-2’ వైఫల్యానికి మాత్రం దర్శకుడి కంటే హీరో కమ్ ప్రొడ్యూసర్ నాగార్జుననే ఎక్కువ నిందించాల్సి ఉంటుంది.

రాహుల్ ‘మన్మథుడు-2’ ప్రాజెక్టులోకి రావడానికి ఏడాది ముందే ‘మన్మథుడు-2’ మాతృక అయిన ఫ్రెంచ్ సినిమా హక్కుల్ని కొని పెట్టుకున్నాడు నాగ్. తన అన్నపూర్ణ స్టూడియోస్ టీంతో దాని మీద వర్క్ చేయించాడు. దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరా అని ఎదురు చూస్తున్న ఆయనకు ‘చి ల సౌ’తో సత్తా చాటుకున్న రాహుల్ కనిపించాడు. హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రాహుల్ మీద ప్రశంసలు కురిపించాడు. అంతకుముందు తనకేమాత్రం పట్టని ‘చి ల సౌ’ సినిమాను టేకప్ చేసి రిలీజ్ చేయించాడు.

అసలు ఫ్రెంచ్ సినిమాను రీమేక్ చేయడానికి రాహుల్ ఒప్పుకోలేదన్నది తెలిసిన విషయమే. సొంత కథతోనే నాగ్ హీరోగా సినిమా చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ అది వద్దని పట్టుబట్టి ‘మన్మథుడు-2’ను అతడితో రీమేక్ చేయించారు. సీనియర్ రైటర్ సత్యానంద్‌ను సైతం అతడికి అటాచ్ చేశారు. ‘చి ల సౌ’ను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దిన రాహుల్.. ‘మన్మథుడు-2’లో అంతగా అడల్ట్ డోస్ దట్టించాడంటే అది ఒరిజినల్ నుంచి తీసుకున్న కంటెంటే.

తాను ఇప్పటికీ ‘మన్మథుడు’నే అని.. చాలా ‘ట్రెండీ’ అని రుజువు చేసుకోవడానికి నాగ్ పట్టుబట్టి ఈ సినిమా చేశాడన్నది చిత్ర వర్గాలు చెబుతున్న మాట. మొత్తానికి ఎలా చూసినా.. ‘మన్మథుడు-2’ ఫెయిల్యూర్లో మేజర్ క్రెడిట్ నాగార్జునకే దక్కుతుంది. ఊరికే దర్శకుడిని నిందించడం వల్ల లాభం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English