కేసీఆర్ కి, డీజీపీ అమ్ముడుపోయాడు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై పెట్టిన సెక్షన్లపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆయనకు రిమాండ్ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. కరీంనగర్ జిల్లా కోర్టులో సవాలు చేయడం.. అక్కడా ఎదురు దెబ్బ తగిలి.. పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం రావటంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులపై బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ కమ్ ఫైర్ బ్రాండ్ అర్వింద్.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని మండిపడ్డారు. మహేందర్ రెడ్డి లాంటి వారి వలనే పోలీస్ శాఖ నాశనమవుతోందన్న ఆయన.. సీఎం కేసీఆర్ కు ఆయన చెంచాగిరి చేస్తున్నారన్నారు.

‘కేసీఆర్ తాగుబోతు ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ కార్యకర్తలు తాగుబోతులు.  ఇనాళ్ళు ఇంట్లో పడుకున్న  కేసీఆర్ .‌. హడావుడిగా జీవో 317ను ఎందుకు తీసుకొచ్చాడు? ఉద్యోగులతో సంప్రదింపులు ఎందుకు జరపటం లేదు?’ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ యేతర పార్టీల నేతలను తెలంగాణ పోలీసులు క్రిమినల్స్ లెక్కన చూస్తున్నారని.. చివరకు భార్య.. పిల్లల వద్దకు కూడా పోనివ్వటం లేదని మండిపడ్డారు. విపక్ష నేతల్ని హౌస్ అరెస్టు చేస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు.

‘‘గన్నారం గ్రామం దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను అడ్డుకుంటే..‌ నిజామాబాద్, కరీంనగర్ సీపీలు ఏమి చేస్తున్నారు?గులాబీ నాయకులు చేసే కార్యక్రమాలకు పోలీస్ లాఠీలకు కన్పించటం‌లేదా? ఇద్దరు ముగ్గురు అధికారులు మినహా.. పోలీసులంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు’’ అని మండిపడ్డారు. తెలంగాణ పోలీసు బాస్ పైనా.. ఇతర ఉన్నతాధికారులపైనా బీజేపీ నేతలు ఈ తీరులో ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది.