మన్మథుడు పడుకున్నాడు.. రాక్షసుడు లేచాడు

మన్మథుడు పడుకున్నాడు.. రాక్షసుడు లేచాడు

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మంచి క్రేజ్ మధ్య రిలీజైన కొత్త సినిమా థియేటర్లు వెలవెలబోతుంటే.. ముందు వారాల్లో రిలీజైన చిత్రాలు బాగా ఆడుతున్నాయి. గత శుక్రవారమే రిలీజైన అక్కినేని నాగార్జున సినిమా ‘మన్మథుడు-2’ను నెగెటివ్ టాక్ బాగానే దెబ్బ కొట్టింది. తొలి రోజు ఓకే అనిపించిన ఈ చిత్రం.. రెండో రోజుకే వీక్ అయిపోయింది.

చాలా కోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ కష్టమైన పరిస్థితి. వీకెండ్ అయ్యాక పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రేక్షకులు లేక ఆ సినిమా థియేటర్లు బోసిపోతున్నాయి. ఈ అడ్వాంటేజీని మిగతా సినిమాలు బాగానే ఉపయోగించుకుంటున్నాయి. ముందు వారంలో వచ్చిన ‘రాక్షసుడు’ ఇప్పుడు బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాల్లో అత్యధిక షేర్ వస్తున్నది ఈ చిత్రానికే.

తొలి వీకెండ్ తర్వాత వీక్ అయి.. శుక్రవారం నాటికి మరింత డల్ అయింది ‘రాక్షసుడు’ చిత్రం. కానీ ‘మన్మథుడు-2’కి డివైడ్ టాక్ రావడంతో ఆ రోజు సాయంత్రానికే ‘రాక్షసుడు’ పుంజుకుంది. శని, ఆదివారాల్లో ఈ చిత్రానికి మంచి షేర్ వచ్చింది. మరోవైపు ‘మన్మథుడు-2’ రిలీజైన తర్వాతి రోజు వచ్చిన ‘కొబ్బరి మట్ట’ అంచనాల్ని మించి ఆడేస్తోంది. ఈ చిత్రానికి తక్కువ థియేటర్లిచ్చారు. వాటిలో అది మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ ఊపు చూసి స్క్రీన్లు, షోలు పెంచుతున్నారు.

ఎప్పుడో మూడు వారాల కిందట రిలీజైన ‘ఇస్మార్ట్ శంకర్’ ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ రాబడుతుండటం విశేషం. తక్కువ స్క్రీన్లలో ఆడుతున్నప్పటికీ.. ‘మన్మథుడు-2’తో సమానంగా దానికి వసూళ్లు వస్తుండటం విశేషం. ఈ వారం ‘రణరంగం’, ‘ఎవరు’ మంచి క్రేజ్ మధ్య రిలీజవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలకు ఈ రెండు రోజుల్లోనే సాధ్యమైనంతగా వసూళ్లు రాబట్టుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English