PK మాటలకు చిరు మద్దతు

మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన ఓ ఈవెంట్ లో ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండనని తేల్చి చెప్పారు. ఎవరికైనా కష్టమొస్తే అక్కడ ఓ బిడ్డగా ఉంటాను కానీ ఇండస్ట్రీ పెద్దగా కాదంటూ తెలిపారు. ఆ హోదా తనకొద్దని చెప్పేశారు చిరు. ఇక తాజాగా ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు హైదరాబాద్ లో జరిగిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరు. 

ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. కొంతమంది అవసరం వచ్చినప్పుడు తమ బుద్ధి చూపిస్తారని.. కానీ తను ఎదుటివారి మంచి కోరుకునేవాడినని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు తన అభిమానులకు ఒకటే చెప్పానని.. తన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే.. తన స్పందన వారిలో వ్యక్థమైనట్లుగా భావిస్తానని అన్నారు.

మన చిత్తశుద్ధి, నిజాయితీ, సంయమనం విజయాలను అందిస్తాయని చెప్పారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘కళ్యాణ్ బాబు ఏ విషయం మీద మాట్లాడినా అది కరెక్ట్ అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అతడు స్పందించడం చూస్తుంటే.. సమంజసంగానే ఉంటుంది. పవన్ న్యాయం కోసమే మాట్లాడతాడు. న్యాయం కోసమే వాదిస్తాడు. నేను కూడా న్యాయం కోసమే మాట్లాడతాను కానీ పవన్ త్వరగా స్పందిస్తాడు.. నేను కొంచెం సమయం తీసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

తన తమ్ముడి గురించి చిరు గొప్పగా మాట్లాడడంతో మెగాభిమానులు ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. చిరు నటించిన ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘భీమ్లానాయక్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా వాయిదా పడింది.