రాజమౌళి లేకుండానే సాధించాడే..

ఒక ప్రాంతీయ భాషా కథానాయకుడు పాన్ ఇండియా స్టార్ కావాలంటే రాజమౌళి సపోర్ట్ తప్పనిసరి అనే అభిప్రాయం బలంగా పడిపోయింది అందరిలోనూ. ప్రభాస్ జక్కన్న అండతోనే పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయ్యాడు. ‘బాహుబలి’ని చూసి చాలామంది ఇలాంటి భారీ ప్రయత్నాలు చేశారు కానీ.. చాలామందికి ఆశించిన ఫలితం రాలేదు. ఆ హీరోల్లో ఎవరూ పాన్ ఇండియా స్టార్ కాలేకపోయారు.

మార్కెట్‌ను విస్తరించలేకపోయారు. ‘కేజీఎఫ్’ మూవీతో యశ్ ఒక మోస్తరుగా మార్కెట్ పెంచుకోగలిగాడు. కానీ అతను కేజీఎఫ్ ఫ్రాంఛైజ్ తర్వాత మరో సినిమా ఏదైనా చేస్తే ఈ క్రేజ్ ఉంటుందా అన్నది డౌటే. టాలీవుడ్ విషయానికి వస్తే ‘బాహుబలి’ ద్వారా వచ్చిన ఇమేజ్‌తో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ప్రభావం చూపుతున్నాడు కానీ.. ఇలాంటి భారీ ప్రయత్నాలు చేసిన మిగతా హీరోలకు ఆశించిన ఫలితం రాలేదు. 

రాజమౌళి తర్వాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్లు అవుతారని, మార్కెట్ బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక జక్కన్నతో తర్వాత సినిమా చేయబోయే మహేష్ బాబు సైతం ఆ చిత్రంతో తన మార్కెట్ పెరుగుతుందని ఆశిస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా స్టార్‌గా అవతరించడం విశేషం. ఆల్రెడీ బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ‘పుష్ప’ మూవీతో ఉత్తరాదిన అతడికి ఊహించని స్థాయిలో మార్కెట్ ఏర్పడింది. తమిళనాట కూడా అతను ప్రభావం చూపించాడు.

అక్కడ కూడా బేస్ వచ్చినట్లే. ‘పుష్ప-2’కు మొత్తంగా ఇండియా అంతటా హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ సినిమా మార్కెట్ లెక్కలే మారిపోబోతున్నాయి. బన్నీ చేయబోయే ఆ తర్వాతి చిత్రాలకూ మంచి క్రేజ్ ఉంటుంది. మొత్తానికి రాజమౌళి లేకుండా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్న హీరోగా బన్నీపై ప్రశంసలు కురుస్తున్నాయిప్పుడు.