545 కోట్లు ఖర్చు పెడితే.. ఒక్క అవార్డివ్వలేదు

545 కోట్లు ఖర్చు పెడితే.. ఒక్క అవార్డివ్వలేదు

భారతీయ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో పరిచయం చేసి.. ఆ విభాగంలో ప్రపంచ స్థాయి ఔట్ పుట్ ఇచ్చిన దర్శకుడు శంకర్. రెండు దశాబ్దాల కిందటే ఆయన విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతాలు చేశారు. పదేళ్ల కిందటే ‘రోబో’ సినిమాతో హాలీవుడ్ చిత్రాలకు దీటైన విజువల్ మాయాజాలాన్ని మన వెండితెరపై చూపించారు. ఇక గత ఏడాది వచ్చిన ‘2.0’తోనూ మరోసారి మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశారు.

మధ్యలో ‘బాహుబలి’తో రాజమౌళి తనను మించిపోవడంతో ఈ చిత్రాన్ని శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఏమాత్రం రాజీపడకుండా నమ్మశక్యం కాని ఖర్చుతో ‘2.0’ విజువల్ ఎఫెక్ట్స్ తీర్చిదిద్దాడు. కానీ ఏం లాభం? రూ.545 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డు రాలేదు.

‘2.0’ సినిమాకు గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు. అంత కష్టపడి తీసిన సినిమాకు వచ్చిన ఫలితం చూసి శంకర్ అండ్ టీం చాలా నిరాశకు గురైంది. కనీసం ఇప్పుడు జాతీయ అవార్డు అయినా వస్తే కొంచెం ఊరటగా ఉండేది. కానీ దీనికి కాకుండా ‘కేజీఎఫ్’ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డిచ్చారు.
‘2.0’లో శంకర్ ఎన్నో అద్భుతాలు చూపించగా.. వాటిని మించి ‘కేజీఎఫ్’ ఎఫెక్ట్స్ జ్యూరీ సభ్యులు ఎందుకు ఎక్కువ మెప్పించాయో మరి? ఎంత ఖర్చు పెట్టారు అనేదానికంటే ఎంత ఎఫెక్టివ్‌గా ఎఫెక్ట్స్ రాబట్టారన్నది క్రైటీరియాగా మారాయని అనుకోవాలేమో.

వీఎఫ్ఎక్స్ విషయంలో అవార్డు ఆశించి నిరాశ చెందిన మరో భారీ చిత్రం కూడా ఉంది. అదే.. షారుఖ్ ఖాన్ నటించిన ‘జీరో’. ఇందులో షారుఖ్‌ను మరగుజ్జుగా చూపించే విషయంలో చిత్ర బృందం ఎంతో కష్టపడింది. ఆ టీం సైతం తమకు అవార్డు దక్కనందుకు బాగా నిరాశ చెందినట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English