నాగార్జునను ఇలా ఎప్పుడూ ఆడుకుని ఉండరు

నాగార్జునను ఇలా ఎప్పుడూ ఆడుకుని ఉండరు

అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది ఇప్పుడే. కెరీర్‌కే మచ్చగా నిలిచిన ‘ఆఫీసర్’ ఆయన మార్కెట్‌ను, ఇమేజ్‌ను దెబ్బ తీసేసింది. ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.

‘దేవదాస్’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మన్మథుడు-2’ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఫలితమేంటో తొలి షోతోనే తేలిపోయింది. ఈ టాక్‌ను తట్టుకుని సినిమా ఏమేరకు నిలబడుతుందో చూడాలి.

ఈ రోజు ఉదయం నుంచి నాగార్జున సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ కావట్లేదు. ఆయన గురించి అవమానకరమైన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. నాగ్‌ గాలి తీసేందుకు దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బహుశా కెరీర్లో ఎన్నడూ కూడా నాగ్ ఇంత నెగెటివిటీ చూసి ఉండడేమో అనిపించే స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.

శనివారం రిలీజవుతున్న ‘కొబ్బరిమట్ట’కు ‘మన్మథుడు-2’తో పోలిస్తే ఎక్కువ క్రేజ్ ఉందని.. ఆ సినిమా ధాటికి ‘మన్మథుడు 2’ నిలవడం కష్టమని పేర్కొంటూ ‘స్మాలర్ దన్ సంపూ’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి నాగార్జునను ట్రోల్ చేస్తుండటం దారుణం. అక్కినేని అభిమానులు ఈ హ్యాష్ ట్యాగ్ చూసి మంటెత్తిపోతున్నారు. ఇంకా లేటు వయసులో నాగ్ రొమాంటిక్ రోల్ చేయడాన్ని ఎద్దేవా చేస్తూ ‘ముసలి మన్మథుడు’ అనే హ్యాష్ ట్యాగ్స్, కామెంట్లు కూడా విస్తృతంగా కనిపిస్తున్నాయి.

సినిమాలో నాగ్ తన మీద తానే రెండు మూడుసార్లు ‘ముసలివాడు’ కామెంట్ చేయడంతో ట్రోలర్లకు మరింతగా కంటెంట్ ఇచ్చినట్లయింది. నాగ్ కోడలు సమంత, రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి బయట వల్లించే ఆదర్శాలకు భిన్నంగా ‘మన్మథుడు-2’ ఉందని.. బూతులతో, అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులతో నిండిన ఇలాంటి సినిమాలు తీస్తూ బయట ఎలా ఆదర్శాలు మాట్లాడతారంటూ వాళ్లను విమర్శిస్తూ ‘మన్మథుడు-2’ సినిమాను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English