మహేష్ మారడు.. దేవిశ్రీ మార్చడు

మహేష్ మారడు.. దేవిశ్రీ మార్చడు

సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్.. ఏస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ చాలా రొటీన్ అయిపోతున్నాయన్న విమర్శలు సినిమా సినిమాకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈసారైనా వాళ్లు మార్పు చూపిస్తారని జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్లలో ఏ చలనం కనిపించడం లేదు. ‘మహర్షి’ సినిమాకు ఇద్దరూ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.

‘మహర్షి’ కంటే ముందు మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’, ‘స్పైడర్’, ‘బ్రహ్మోత్సవం’, ‘శ్రీమంతుడు’ సినిమాల్ని పరిశీలిస్తే లుక్స్ పరంగా మహేష్ నుంచి ఏ మార్పూ కనిపించదు. ఒకే హేర్ స్టైల్.. ఒకే రకమైన స్టైలింగ్‌తో మహేష్ బోర్ కొట్టించేశాడు. నటన పరంగా కూడా పెద్దగా వైవిధ్యం కనిపించదు. మిగతా హీరోలు పాత్రలకు తగ్గట్లుగా తమను తాము మలుచుకుంటున్నారు. అందుకోసం ఎంతో శ్రమిస్తున్నారు. సినిమాల ఫలితాలెలా ఉన్నా.. వైవిధ్యం చూపించేందుకు తపిస్తున్నారు. కానీ మహేష్‌లో మాత్రం ఈ దిశగా కదిలికే ఉండట్లేదు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో అతను మొదలుపెట్టిన ‘సరిలేరు నీకెవ్వరు’లో సైనికాధికారి పాత్ర పోషిస్తున్నాడని తెలియగానే.. ఈసారి లుక్ కచ్చితంగా మారుతుందని అంతా అనుకున్నారు. కనీసం ఆర్మీ కటింగ్ చేసుకుని క్లీన్ షేవ్ చేసుకుని కొత్తగా కనిపిస్తాడని అనుకున్నారు. కానీ మహేష్ మాత్రం ఎప్పట్లాగే తనకు అలవాటైన హేర్ స్టైల్, ట్రిమ్ చేసిన గడ్డంతో వచ్చేశాడు. జస్ట్ డ్రెస్ మారింది తప్పితే.. లుక్ పరంగా ఏ మార్పూ లేదు. అతడి మేకప్, వాకింగ్ స్టైల్, బిల్డప్ అన్నీ కూడా రొటీన్‌గా అనిపించాయి. ‘నా పేరు సూర్య’ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులో సైనికుడి పాత్ర కోసం బన్నీ ఎలా మేకోవర్ అయ్యాడో.. ఎంత కష్టపడ్డాడో ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక దేవిశ్రీ విషయానికి వస్తే.. ‘మహర్షి’కి ఎంతగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అతను ఆ ఫీడ్ బ్యాక్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఎప్పుడూ వినిపించే ట్యూన్స్‌నే కొంచెం అటు ఇటుగా మార్చి చాలా బోరింగ్‌గా అనిపించేే బ్యాగ్రౌండ్ సాంగ్‌తో మహేష్ బర్త్‌డే టీజర్‌ను తేల్చి పడేశాడు. మహేష్ ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటో కానీ.. మిగతా వాళ్లు మాత్రం మహేష్ లుక్స్.. దేవిశ్రీ ట్యూన్స్ మారవా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English