చరణ్‌కు అన్యాయం.. అప్పుడు, ఇప్పుడు

చరణ్‌కు అన్యాయం.. అప్పుడు, ఇప్పుడు

చేతిదాకా వచ్చింది నోటికి అందకపోవడం అంటే ఇదే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక లైఫ్ టైం ఛాన్స్ మిస్సయ్యాడు. జాతీయ ఉత్తమ నటుడిగా నిలవడానికి అన్ని అర్హతలూ ఉండి కూడా అవార్డు గెలవలేకపోయాడు. అతడిని కాదని ‘అందదున్’కు గాను ఆయుష్మాన్ ఖురానా.. ‘యురి’కి గాను విక్కీ కౌశల్ ఉమ్మడిగా అవార్డును గెలుచుకున్నారు. వాళ్ల నటనను తక్కువ చేయడం కాదు కానీ.. ఈ రెండు సినిమాల్లో కథానాయకుడి పాత్ర, నటనతో పోలిస్తే ‘రంగస్థలం’లో చరణ్ పెర్ఫామెన్స్ కచ్చితంగా మెరుగ్గా అనిపిస్తుంది.

ఈ మూడు సినిమాల్ని పోల్చి చూసిన ఎవ్వరైనా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. చరణ్ నుంచి అసలు ఊహించిన పెర్ఫామెన్స్ ‘రంగస్థలం’లో చూశాం. చరణ్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవాళ్లు కూడా ఈ సినిమా చూసి షాకయ్యారు. చిట్టిబాబు పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు.. ఎమోషన్లు పండించిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

మళ్లీ చరణ్ నుంచి ఇలాంటి పెర్ఫామెన్స్ ఎప్పటికీ చూడమేమో. గత ఏడాది కాలంలో వచ్చిన వేరే సినిమాల్లో ఇంకెవరైనా చరణ్ కంటే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ ‘అందాదున్’, ‘యురి’ సినిమాల్లో హీరోలు చరణ్ కంటే మెరుగైన నటన ప్రదర్శించారంటే మాత్రం అంగీకరించలేం.

చరణ్‌కు ఇక్కడ అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఒకప్పుడు నంది అవార్డుల్లో కూడా చరణ్‌కు అన్యాయమే జరిగింది. ‘మగధీర’లో అతను అంచనాల్ని మించి రాణించాడు. రెండు పాత్రల్లో వేరియేషన్లు చూపిస్తూ మంచి నటన కనబర్చాడు. ఐతే ఆ ఏడాది ‘మేస్త్రి’ సినిమాకు గాను దాసరి నారాయణరావును ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఎంపిక అన్నది స్పష్టం. ఆ సెలక్షన్ ఎవరికీ రుచించలేదు.

ఆ ఏడాది చరణ్ కంటే మంచి పెర్ఫామెన్స్ ఇచ్చిన వేరే వాళ్లు ఉండొచ్చేమో కానీ.. ‘మేస్త్రి’లో నటనకు గాను దాసరికి అవార్డివ్వడం అంటే చరణ్‌కు అన్యాయం చేసినట్లే. ఇప్పుడు జాతీయ అవార్డుల్లో కూడా అలాంటి అన్యాయమే జరిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English