విజ‌య నిర్మ‌ల చివ‌రి రోజులపై న‌రేష్‌..

 విజ‌య నిర్మ‌ల చివ‌రి రోజులపై న‌రేష్‌..

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను, ప్రేక్ష‌కుల్ని  విషాదంలో ముంచెత్తిన మ‌ర‌ణం విజ‌య నిర్మ‌ల‌దే. ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లోనే ఏ మ‌హిళా ద‌ర్శ‌కురాలికీ సాధ్యం కాని ఘ‌న‌త‌లందుకున్న విజ‌య నిర్మ‌ల‌.. సినీ ప‌రిశ్ర‌మ‌లో లెజెండ‌రీ స్టేట‌స్ సంపాదించారు. వ్య‌క్తిగ‌తంగానూ ఆమెకు చాలా మంచి పేరుంది.

ఆమె అనారోగ్యం, చ‌నిపోవ‌డానికి ముందు ఎదురైన ప‌రిణామాల గురించి భ‌ర్త కృష్ణ ఇప్ప‌టికే ఒక ఇంట‌ర్వ్యూలో వివ‌రాలు వెల్ల‌డించారు. ఐతే చివ‌రి రోజుల్లో విజ‌య‌నిర్మ‌ల అనుభ‌వించిన మాన‌సిక వేద‌న గురించి కొడుకు న‌రేష్ ఒక టీవీ కార్య‌క్ర‌మంలో మాట్లాడాడు. క‌ష్ణ విష‌య‌మై విజ‌య నిర్మ‌ల ఎంత త‌ల్ల‌డిల్లింది ఆయ‌న వెల్ల‌డించాడు. త‌న త‌ల్లి పెద్ద మ‌న‌సు గురించి కూడా న‌రేష్ ఈ కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పాడు.

"చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఆమె నడవటానికి ఇబ్బంది పడేవారు. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. ఒక రోజు ఆమె ఏడ్చేశారు. కృష్ణగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేను, ఆయనను ఇబ్బంది పెట్టడమే కాకుండా, మిమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నా" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ రోజు నేను కూడా ఏడ్చేశా. కానీ కృష్ణ‌గారికి త‌న బాధ తెలియ‌కుండా ఉండేందుకు నవ్వుతూ ఉండేవారు. కృష్ణగారిని ఆమె ఒక తల్లిలా చూసుకున్నారు. భార్యగా, స్నేహితురాలిగా ప్రతి సమయంలోనూ అండగా నిలిచారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం చాలా కష్టం. అలాంటింది ఆమె మా అన్నదమ్ములందరినీ కలిపారు. ఆమె ఎంతోమందికి సాయం చేశారు. ఎన్నో పెళ్లిళ్లు చేయించారు. మా ఇంట్లో ఐదేళ్లు దాటి పనిచేసిన ప్రతి ప‌ని మ‌నిషికీ డ‌బుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆమెను ప్రోత్సహించిన బాలసరస్వతిగారికి ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చారు" అని న‌రేష్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English