మళ్లీ త్రివిక్రమ్ సమేత తారక్

మళ్లీ త్రివిక్రమ్ సమేత తారక్

దర్శకుడిగా రెండో సినిమాకే ‘స్టార్’ స్టేటస్ సంపాదించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ హోదా అందుకున్నాక వరుసగా పెద్ద స్టార్లతో సినిమాలు సెట్ అయిపోతాయి. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్.. ఇలా మార్చి మార్చి పెద్ద స్టార్లతో సినిమాలు చేశాడు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ వరకు రావడానికి చాలా టైం పట్టేసింది. చివరికి వీళ్లిద్దరూ గత ఏడాది ‘అరవింద సమేత’ కోసం జట్టు కట్టారు.

‘అజ్ఞాతవాసి’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత కూడా త్రివిక్రమ్‌ను నమ్మి ఈ సినిమా చేశాడు తారక్. అందుకు మంచి ఫలితమే దక్కింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంత పెద్ద హిట్ అందుకున్నాక త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయాలని తారక్ ఎలా ఆశ పడకుండా ఉంటాడు? ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని మరోసారి డైరెక్ట్ చేయాలని త్రివిక్రమ్ మాత్రం ఎందుకు అనుకోడు?

తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత’ తర్వాత మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నాడు తారక్. అతను ఈ సినిమా నుంచి బయటికి రావడానికి ఇంకో పది నెలలు పట్టొచ్చు. ప్రస్తుతం త్రివిక్రమ్.. అల్లు అర్జున్ హీరోగా సినిమా చేస్తున్నాడు. దీని నుంచి ఆయన వచ్చే ఏడాది జనవరికి బయటికి వస్తాడు. ఆ తర్వాత తారక్ ఫ్రీ అయ్యే సమయానికి త్రివిక్రమ్ స్క్రిప్టుతో రెడీ అవుతాడట. వీళ్లిద్దరి కలయికలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం.

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తోనూ తారక్ ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ.. దాని కంటే ముందే త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేస్తాడని సమాచారం. ప్రశాంత్ ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న ‘కేజీఎఫ్-2’ వచ్చే ఏడాది వేసవికి షెడ్యూల్ అయింది. దాని పని పూర్తి చేసి తారక్‌ సినిమాకు స్క్రిప్టు రెడీ చేయడానికి అతడికి సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు త్రివిక్రమ్‌తో లాగించేయాలని తారక్ ప్లాన్ చేసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English