2021: జగన్ రివ‌ర్స్ గేర్‌.. ఎన్నిక‌ల్లో టాప్‌

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌తో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోన్న న‌వ‌ర‌త్నాల పేరుతో ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల రూపంలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతూనే ఉన్నారు. అధికారంలోకి రాగానే కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం ఆయ‌న త‌న నిర్ణ‌యాల్లో కొన్నింటిని వెన‌క్కి తీసుకున్నారు. పాల‌న‌ప‌రంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. కానీ రాజ‌కీయాల ప‌రంగా మాత్రం రాష్ట్రంలో 2021లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ వైసీపీ విజ‌యాలు సాధించింది.

మూడు రాజ‌ధానుల‌పై..
జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌రావ‌తి ఒక్క‌టే రాజ‌ధానిగా ఉండ‌ద‌ని.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తామ‌ని సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా, విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా మారుస్తామ‌న్నారు. అయితే వైసీపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. జ‌గ‌న్ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు దీక్ష‌కు దిగారు. మూడు రాజ‌ధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ ర‌ద్దుపై హైకోర్టులో విచార‌ణ కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ ర‌ద్దు బిల్లును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. మార్పుల‌తో తిరిగి బిల్లులు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెప్పినప్పటికీ జ‌గ‌న్ నిర్ణ‌యాల్లో ముఖ్యమైన దాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం ఈ ఏడాదే జ‌రిగింది.

అవి కూడా..
మ‌రోవైపు శాస‌న మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉప సంహ‌రించుకుంది. శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన జ‌గ‌న్ ఏడాదిన్న‌ర తిర‌గ‌కుండానే ఆ బిల్లును కూడా వెన‌క్కి తీసుకున్నారు. మండ‌లిలో బ‌లం పెర‌గ‌డంతో రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే  ఉద్దేశంతో జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గార‌ని స‌మాచారం. ఇక మ‌ద్య నిషేధం కోసం ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ ఏడాది వాటిని త‌గ్గించింది.

రాజ‌కీయంగా హిట్‌..
రాజ‌కీయంగా మాత్రం జ‌గ‌న్‌కు ఈ ఏడాది ఎంత‌గానో క‌లిసొచ్చింది. పంచాయ‌తీ, మున్సిపాలిటీ, కార్పొరేష‌న్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి విజ‌యాలు అందుకుంది. ప్ర‌త్య‌ర్థి టీడీపీని చిత్తు చిత్తు చేసింది. ముఖ్యంగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కంచు కోట కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లోనూ పార్టీ రికార్డు స్థాయి మెజారిటీ సాధించింది.