రజనీపై సెటైర్.. బాయ్‌కాట్ అంటున్న ఫ్యాన్స్

 రజనీపై సెటైర్.. బాయ్‌కాట్ అంటున్న ఫ్యాన్స్

తమ సినిమాల్లో స్టార్ హీరోల గురించి కామెడీలు చేసేటపుడు కాస్త ముందు వెనుక చూసుకోవాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా అభిమానులు హర్ట్ అయిపోతారు. వ్యతిరేక గళం వినిపిస్తారు. ఆ సినిమాల్ని బాయ్‌కాట్ చేయడానికి కూడా వెనుకాడరు. అందులోనూ ఇది సోషల్ మీడియా కాలం కావడంతో వేగంగా నెగెటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. తాజాగా జయం రవి-కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘కోమలి’ టీంకు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది.

ఈ చిత్రంలో హీరో టీనేజీలో ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్తాడు. 16 ఏళ్ల తర్వాత లేస్తాడు. అన్నేళ్ల పాటు తాను కోమాలో ఉన్నానంటే నమ్మడు. దీంతో హీరో ఫ్రెండు టీవీ పెట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటిస్తున్న వీడియో చూపిస్తాడు. కావాలంటే చూడు ఇది 2016 అంటాడు. హీరో ఆ వీడియో చూసి నన్ను ఏమార్చకండి.. రజనీ రాజకీయారంగేట్రం చేస్తానని అంటున్నాడంటే ఇది 1996 అంటాడు. అంటే పరోక్షంగా రజనీ 20 ఏళ్ల ముందు నుంచే రాజకీయారంగేట్రం గురించి కబుర్లు చెబుతూనే ఉన్నాడంటూ సెటైర్ వేసిందన్నమాట చిత్ర బృందం.  

ట్రైలర్ చివర్లో ఈ పంచ్ అయితే భలేగా పేలింది కానీ.. రజనీ మీద ఇలా పంచ్ వేసేసరికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ హర్టయిపోయారు. వెంటనే సోషల్ మీడియాలో రగడ మొదలైంది. ‘బాయ్‌కాట్ కోమలి’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి జయం రవి అండ్ టీంను ఏకేస్తున్నారు. ఒక్క డైలాగ్‌తో రవి.. రజనీ అభిమానుల దృష్టిలో విలన్ అయిపోయాడు. ఐతే రజనీ రాజకీయారంగేట్రం గురించి ప్రకటించినపుడు రవి ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ అతడి మద్దతుదారులు సూపర్ స్టార్ అభిమానుల్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వాళ్లేమీ తగ్గట్లేదు. ఇంకో పది రోజుల్లో రిలీజ్ అనగా ఈ వివాదం చుట్టుముట్టడంతో జయం రవి అండ్ టీం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పక తప్పేట్లు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English