‘సాహో’ స్టోరీ మార్చలేదు.. స్కేల్ మారింది

‘సాహో’ స్టోరీ మార్చలేదు.. స్కేల్ మారింది

యువ దర్శకుడు సుజీత్ తొలి సినిమా ‘రన్ రాజా రన్’ రిలీజై ఐదేళ్లు దాటిపోయింది. ఇంకా అతడి రెండో సినిమా విడుదల కాలేదు. ఒక సూపర్ హిట్ అందించాక రెండో సినిమా కోసం ఐదేళ్లు ఎదురు చూడాల్సి రావడం ఆశ్చర్యమే. ఐతే ప్రభాస్ లాంటి హీరో చేతికి దొరకడంతో ఈ సినిమా ఎంత ఆలస్యం అవుతుంది అన్నది తాను ఆలోచించలేదని అంటున్నాడు సుజీత్.

తన రెండో సినిమా ఐదేళ్ల గ్యాప్‌లో రిలీజవుతుందని తనకు తెలియదని.. ఒకవేళ ఈ సినిమా ఓకే అయిన రోజే ఇంత గ్యాప్ రాబోతోందని తెలిస్తే తాను ఎలా ఆలోచించేవాడినో తనకు తెలియదని అన్నాడు సుజీత్. ఐతే సినిమా ఆలస్యం అయిందని తాను ఎప్పుడూ భావించలేదని.. సినిమా మొదలవడానికి ముందు మూడేళ్లలో తానేమీ ఖాళీగా లేనని.. ప్రతి రోజూ పనిలోనే ఉన్నానని సుజీత్ చెప్పాడు.

పది సినిమాల్లో నేర్చుకునే విషయాలు ‘సాహో’ ఒక్కదానికే నేర్చుకున్నానని.. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లతో కలిసి సుదీర్ఘ కాలం ప్రి ప్రొడక్షన్ పనుల్లో పని చేస్తూ జీవిత కాల అనుభవం సంపాదించినట్లు సుజీత్ తెలిపాడు. ‘బాహుబలి’ విడుదలకు ముందే ‘సాహో’ కథను ప్రభాస్‌కు చెప్పి ఓకే చేయించుకున్నానని.. ఐతే ‘బాహుబలి’ విడుదలై పెద్ద విజయం సాధించింది, ప్రభాస్ ఇమేజ్ మారిపోయింది కదా అని కథలో ఎలాంటి మార్పులూ చేయలేదని అతను స్పష్టం చేశాడు.

కాకపోతే ప్రభాస్ ఇమేజ్, మార్కెట్ పెరిగాయి కాబట్టి సినిమా స్కేల్ పెంచామని.. పెద్ద కాన్వాస్‌లో తీశామని.. ఇది తప్ప కథ పరంగా మార్పేమీ ఉండదని అతను తెలిపాడు. పెద్ద పెద్ద.. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లతో పని చేయడం తనను ఏమాత్రం ఒత్తిడికి గురి చేయలేదని.. షూటింగుకి ముందే వాళ్లందరిలో చక్కటి సమన్వయం ఏర్పడటంతో ఏ బెరుకూ లేకుండా పని చేసుకుపోయానని సుజీత్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English