ఎంత రీమేక్ అయినా.. ఇంతగా దించేయాలా?

ఎంత రీమేక్ అయినా.. ఇంతగా దించేయాలా?

రీమేక్ సినిమాలు చేస్తున్నపుడు మాతృకను మారిస్తే ఒక తంటా. ఉన్నదున్నట్లు తీస్తే ఇంకో తంటా. మార్పులు చేస్తే చెడగొట్టారంటారు. మాతృకను ఫాలో అయితే.. జిరాక్స్ కాపీ అంటారు. దీంతో మార్పులు చేయాలా వద్దా అని ఫిలిం మేకర్స్ తర్జనభర్జనకు గురవుతుంటారు. ఐతే ‘రాక్షసుడు’ టీం మాత్రం పూర్తి స్పష్టతతో ఉన్నట్లుంది.

పొల్లుబోకుండా మాతృకను ఫాలో అయిపోవాలని దర్శకుడు రమేష్ వర్మ డిసైడైపోయాడు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒరిజినల్‌ను దించేశాడు. తమిళంలో ‘రాక్షసన్’ అనే పేరు పెడితే.. తెలుగులో ‘రాక్షసుడు’ టైటిల్ ఖాయం చేశారు. ఒరిజినల్లో హీరో పేరు అరుణ్ అయితే.. తెలుగులో కూడా అదే పెట్టారు.

ఒక చిన్న చిన్న షాట్స్ సైతం యాజిటీజ్ ఫాలో అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. డైలాగులతో సహా సినిమాను యాజిటీజ్ తీయడమే ఆశ్చర్యమంటే కొన్ని సీన్లను ఒరిజినల్‌ నుంచి తీసుకొచ్చి అలాగే తెలుగు వెర్షన్లో పెట్టేయడం విడ్డూరం. సినిమాలో ఓపెనింగ్ షాటే మాతృక నుంచి తీసుకున్నది. ఇంకా కొన్ని చోట్ల మాతృకలోని దృశ్యాలు, పాత్రలు కనిపిస్తాయి. విలన్ తాలూకు ఫ్లాష్ బ్యాక్‌ను కూడా ఉన్నదున్నట్లుగా పట్టుకొచ్చి ఇందులో పెట్టేశారు.

లొకేషన్లు, ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒరిజినల్లో మాదిరే ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం మళ్లీ కొత్తగా చేయించుకున్నట్లు లేదు. ఒరిజినల్ స్కోరే తీసుకొచ్చి పెట్టేసినట్లున్నారు. తెలుగులో రీమేక్ చిత్రాల చరిత్రలో ఇంతగా ఒరిజినల్‌ను మక్కీకి మక్కీ దించేసిన సినిమా మరొకటి కనిపించదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English