అడ్వాంటేజ్ బాక్సాఫీస్.. వాడుకునేదెవరో?

అడ్వాంటేజ్ బాక్సాఫీస్.. వాడుకునేదెవరో?

సినీ ప్రియులు కొత్త విందుకు సిద్ధమైపోయారు. మళ్లీ వీకెండ్ వచ్చేసింది. శుక్రవారం కొత్త సినిమాల విందుకు రంగం సిద్ధమైంది. ఈ వారం ఇద్దరు యువ కథానాయకులు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆ ఇద్దరి కెరీర్లూ ఇప్పుడు డోలాయమాన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు చేసిన సినిమాలు ఆడకుంటే భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుంది. దీంతో తమ సినిమాలపై వాళ్లు భారీ ఆశలతో ఉన్నారు. ఆ ఇద్దరు హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, కార్తికేయ గుమ్మకొండ కాగా.. వాళ్లు నటించిన చిత్రాలు ‘రాక్షసుడు’, ‘గుణ 369’.

కెరీర్లో ఇప్పటిదాకా ఆరు సినిమాలు చేసినా.. నిఖార్సయిన సక్సెస్ రుచి చూడనేలేదు శ్రీనివాస్. సినిమా సినిమాకూ అతడి రేంజ్ పడిపోతోంది. ఐతే ఇంతకుముందు మాస్ మసాలా సినిమాల వైపు పరుగెత్తిన అతను.. తొలిసారిగా కథాబలం ఉన్న థ్రిల్లర్ మూవీ చేశాడు. తమిళంలో హిట్టయిన ‘రాక్షసన్’కు రీమేక్ కావడంతో ఇక్కడ కూడా సినిమా బాగా ఆడుతుందని ఆశతో ఉన్నారు. వేరే ప్రయోగాలేమీ చేయకుండా మాతృకను ఫాలో అయిపోయినట్లున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. ఈసారైనా శ్రీనివాస్‌కు ఒక మంచి విజయం దక్కుతుందేమో చూడాలి.

మరోవైపు ‘ఆర్ఎక్స్ 100’తో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కార్తికేయ.. ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ‘హిప్పి’తో నేలమీదికి వచ్చేశాడు. ‘గుణ 369’ కూడా ఆడకపోతే కార్తికేయ ఎంత వేగంగా పైకి లేచాడో అంతే వేగంగా కింద పడిపోయినట్లవుతుంది. ఇక అతడి తర్వాతి సినిమాను పట్టించుకునే వాళ్లుండరు. కాబట్టి ‘గుణ’ మీద చాలా ఆశలతో ఉన్నాడు కార్తికేయ.

గత వారం వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చతికిలపడిపోయింది. అది పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. ముందు వారం వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ పోటీ లేక ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. కొత్త సినిమాల్లో దమ్ముంటే బాక్సాఫీస్‌ను టేకోవర్ చేయడానికి మంచి అవకాశమే ఉంది. మరి ఈ రెండు సినిమాలు ఏ మేరకు అడ్వాంటేజీని ఉపయోగించుకుంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English