తెలుగు తెరపై మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్

తెలుగు తెరపై మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్

ఫలితాలతో సంబంధం లేకుండా తెలుగులోో వరుసగా బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. సినిమా వాళ్లతో పాటు రాజకీయ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల జీవిత కథల్ని వెండి తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక ఆసక్తికర బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే.. జార్జిరెడ్డి. దశాబ్దాల కిందట ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాన్ని గొప్పగా నడిపించి హీరోగా నిలిచి.. అనూహ్య రీతిలో క్యాంపస్‌లోనే హత్యకు గురైన జార్జిరెడ్డి జీవి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకుముందు నక్సలిజం నేపథ్యంలో ‘దళం’ అనే సినిమా తీసిన జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దళం’ కమర్షియల్‌ సక్సెస్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమా వచ్చిన దాదాపు దశాబ్దం తర్వాత జీవన్ మళ్లీ డైరెక్షణ్ చేస్తున్నాడు.

‘వంగవీటి’ సినిమాలో లీడ్ రోల్‌తో మెప్పించిన సందీప్.. ‘జార్జిరెడ్డి’గా నటిస్తున్నాడు. ఎ బయోపిక్ ఆఫ్ ద ఫర్గాటెన్ లీడర్ అంటూ దీని ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. జార్జిరెడ్డిగా సందీప్‌కు బాగానే మేకోవర్ చేశారు. ఇంటెన్స్‌గా, వైవిధ్యంగా అనిపిస్తున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. టాలెంటెడ్ ఆర్టిస్టు సత్యదేవ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. సరిగా తీయాలే కానీ.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే విషయం ఉన్న కథ జార్జి రెడ్డిది. 1906-70 దశకాల్లో జార్జి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పటికీ ఉస్మానియా యూనివర్శిటీలో జార్జి రెడ్డి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. జార్జి బతికి ఉంటే పెద్ద రాజకీయ నాయకుడు కూడా అయ్యేవాడేమో. జార్జి సామాన్యుడిగా యూనివర్శిటీలో అడుగుపెట్టడం.. ఉద్యమాన్ని నడిపించడం.. పెద్ద విద్యార్థి నాయకుడిగా ఎదగడం.. చిన్న వయసులోనే క్యాంపస్‌లో హత్యకు గురవడం.. ఈ ఉదంతాలన్నీ ఆసక్తి రేకెత్తించేవే. అప్పటి క్యాంపస్ వాతావరణాన్ని తెరపై ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English