కంగనాకు ఈ బ్రేక్ చాలా అవసరం

కంగనాకు ఈ బ్రేక్ చాలా అవసరం

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దోళ్లు ఊరికే చెప్పలేదు. కాలం కలిసొచ్చినపుడు, మన హవా సాగుతున్నపుడు మరీ విర్రవీగిపోకూడదు. ఫాంలో ఉన్నపుడు ముందు వెనుక చూసుకోకుండా వ్యవహరిస్తే.. జనాలకు తిక్క రేగుతుంది. కింద పడ్డపుడు అందరూ కలిసి తొక్కేస్తారు. కంగనా రనౌత్ విషయంలో ఇదే జరిగింది.

వరుసగా హిట్లు వస్తున్నపుడు, మంచి ఫాంలో ఉన్నపుడు ఆమె రెచ్చిపోయింది. అదే పనిగా బాలీవుడ్లో ప్రముఖుల్ని టార్గెట్ చేసింది. అనవసర వివాదాలు రాజేసింది. మీడియాతో కూడా సున్నం పెట్టుకుంది. వీళ్లందరూ సరైన సమయం కోసం ఎదురు చూశారు.

అంతగా బజ్ లేని కంగనా కొత్త సినిమా ‘జడ్జిమెంటల్ హై క్యా’కు గట్టి పంచ్ ఇచ్చారు. కంటెంట్ ఉన్న సినిమానే అయినప్పటికీ.. మీడియా వాళ్లు తిరుగుబావుటా ఎగురవేయడం వల్ల ఇది జనాల్లోకి చేరలేదు. దీని టాక్ కూడా స్ప్రెడ్ కాలేదు. విషయం ఉన్న సినిమానే అయినప్పటికీ.. వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ట్రేడ్ పండితుల మాటల్లో చెప్పాలటే ఇది డిజాస్టరే. పరిస్థితి చూస్తుంటే కంగనా నటించే ప్రతి సినిమాకూ మున్ముందు ఇలాంటి అనుభవాలు తప్పవేమో అనిపిస్తోంది.

కంగనాకు ఉన్న అహానికి ఆమె మీడియాకు సారీ చెప్పే పరిస్థితి లేదు. మీడియా వాళ్లు బయటికేదీ చెప్పరు కానీ.. సైలెంటుగా ఆమెకు చేయాల్సిన నష్టం చేస్తారు. నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తారు. సినిమాకు ప్రచారం లేకుండా చేస్తారు. ఎలాగూ బాలీవుడ్ పెద్దల సపోర్ట్ కూడా మీడియా వాళ్లకు ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కంగనాకు భవిష్యత్తులో మరింత ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో కంగనాకు అవసరమైన బ్రేక్ లభిస్తోంది. ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర చేస్తోంది. ఈ సినిమా కోసం హిందీలో విరామం తీసుకుంటోంది. ఈ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించి.. కొంచెం గ్యాప్ తర్వాత హిందీలోకి వెళ్తే పరిస్థితులు మెరుగుపడతాయేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English