అవతార్ వద్దన్నాడట.. బాలీవుడ్ నటుడి కామెడీ

అవతార్ వద్దన్నాడట.. బాలీవుడ్ నటుడి కామెడీ

ఇది సోషల్ మీడియా కాలం. అతిశయోక్తులు మాట్లాడితే అంతే సంగతులు. ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టని నెటిజన్లు.. ఎవరిని ఆడుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల చేతికి దొరికితే పరువు గంగలో కలిసినట్లే. ఏదో చిన్న టీవీ ఛానెల్ అని.. యూట్యూబ్ ఛానెల్ కదా అని.. ఇంటర్వ్యూలపుడు అతి చేస్తే అడ్డంగా బుక్ అయిపోవడమే.

బాలీవుడ్ నటుడు గోవిందా ఇప్పుడు అలాగే దొరికిపోయాడు. తొమ్మిదేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లతో వరల్డ్ సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసిన ‘అవతార్’ సినిమా కోసం దర్శకుడు జేమ్స్ కామెరూన్ తనను అడిగాడని.. ఎక్కువ రోజులు డేట్లు ఇవ్వాల్సి ఉంటుందని తాను ఈ సినిమా ఒప్పుకోలేదని గోవిందా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో దుమారం రేగింది. అతడిని రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో జనాలు ఆటాడేసుకుంటున్నారు.

గోవిందా కొన్నేళ్ల కిందట ‘అవతార్ బ్యాక్’ అనే సినిమాలో నటించాడు. కానీ అది విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. దీంతో పాటు ‘అవతార్’ ప్రస్తావన కూడా వచ్చింది. దాని గురించి అతను మాట్లాడుతూ.. ‘అవతార్‌’ సినిమా టైటిల్‌‌ను కామెరూన్‌కు సూచించింది తానే అన్నాడు. అంతే కాక ఈ సినిమాలో నటించమంటే తాను తిరస్కరించానని కూడా అన్నాడు.

‘‘అవతార్‌  టైటిల్‌ నేనే ఇచ్చా. చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది. సినిమా అద్భుత విజయం సాధిస్తుందని జేమ్స్‌ కెమెరూన్‌కు ముందే చెప్పా. సినిమా మొత్తం పూర్తి చేయడానికి దాదాపు ఏడేళ్లు పట్టేలా ఉందని కూడా అన్నాను. దీంతో ఆయనకు కోపం వచ్చింది. నేను ‘అవతార్‌’కు ఏడేళ్లు తీసుకుంటానని నువ్వు అంత కచ్చితంగా ఎలా చెబుతున్నావు? అని నన్ను ప్రశ్నించారు. మీరు ఊహించింది జరగడం, అలా సినిమాను తీర్చిదిద్దడం తక్కువ సమయంలో సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశాను. ఈ సినిమాలో నటించమని నన్నడిగారు. ఐతే నేను 410 రోజులు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని కెమెరూన్‌ చెప్ాపడు. కానీ శరీరం మొత్తం రంగులు రాసుకోవడం నాకిష్టం లేదు. అలా నేను చేయలేను.. క్షమించండి అన్నా’ అని గోవిందా ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఐతే గోవిందా మాటలేవీ నమ్మశక్యంగా లేకపోవడంతో నెటిజన్లు అతడిని సోషల్ మీడియాలో ఆటాడేసుకుంటున్నారు. ఏం చూసి గోవిందాను కామెరూన్ ‘అవతార్’ కోసం అడిగి ఉంటారని ప్రశ్నిస్తున్నారు. గోవిందా మీద పెద్ద ఎత్తున మీమ్స్ సృష్టిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English