సురేష్ ప్రొడక్షన్స్ చేతికి ఇంటర్నేషనల్ సినిమా

 సురేష్ ప్రొడక్షన్స్ చేతికి ఇంటర్నేషనల్ సినిమా

ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి.. కొన్నేళ్లుగా చిన్న సినిమాలకే పరిమితం అవుతూ వస్తున్న సురేష్ ప్రొడక్షన్స్.. మళ్లీ భారీ చిత్రాలపై కన్నేసినట్లే ఉంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్-నాగచైతన్య కలయికలో ‘వెంకీ మామ’ అనే పెద్ద సినిమా చేస్తున్న సురేష్ సంస్థ.. భారీ బడ్జెట్లో రానా దగ్గుబాటి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ తీయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అది మొదలు కావడానికి ముందే ఒక ఇంటర్నేషనల్ సినిమాను తన చేతుల్లోకి తీసుకుంది సురేష్ ప్రొడక్షన్స్. అది శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే చిత్రం కావడం విశేషం.

మురళీధరన్ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే వెల్లడైన సంగతి తెలిసిందే. విజయ్, మురళీ ఇద్దరూ ఈ సినిమా గురించి ధ్రువీకరించారు. ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకుడెవరు, నిర్మాతలెవరు అన్నది వెల్లడైంది. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దార్ ఫిల్మ్స్ బేనర్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని సురేష్ తనయుడు రానా కూడా కన్ఫమ్ చేశాడు.

పెద్ద బడ్జెట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా తీసి.. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English