ఏకంగా ‘ఎవెంజర్స్’ థానోస్‌తో పోల్చేశాడే..

ఏకంగా ‘ఎవెంజర్స్’ థానోస్‌తో పోల్చేశాడే..

ప్రస్తుతం ఇండియాలో చిత్రీకరణ దశలో ఉన్న క్రేజీయెస్ట్ సినిమాల్లో ‘కేజీఎఫ్-2’ ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే ‘బాహుబలి-2’ తర్వాత వివిధ ఇండస్ట్రీల జనాలు ఓ సీక్వెల్ కోసం ఇంతగా ఎదురు చూడటం ఈ సినిమా విషయంలోనే జరుగుతోంది. పెద్దగా అంచనాల్లేకుండానే విడుదలై వివిధ భాషల వాళ్లను మెస్మరైజ్ చేసింది ‘కేజీఎఫ్’.

హీరో యశ్ సహా ఆ చిత్రంలో నటించిన ప్రధాన పాత్రధారులందరూ కర్ణాటక అవతల కొత్త వాళ్లే. అయినా ఆ సినిమా అందరికీ కనెక్ట్ అయింది. మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చింది. ఇప్పుడు యశ్ అందరి వాడు అయ్యాడు. పైగా సినిమాకు పేరున్న తారాగాణం యాడ్ అవుతోంది. సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ ప్రముఖుడు ‘కేజీఎఫ్-2’లో విలన్ పాత్ర చేస్తుండటం సినిమాకు ఎంత పెద్ద ఆకర్షణో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తాజాగా రిలీజ్ చేసిన సంజయ్ దత్ ప్రి లుక్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ‘కేజీఎఫ్-ఛాప్టర్ 1’లో ఎవరో అనామక నటుడు చేసిన అధీర (తెలుగులో గరుడ) పాత్ర ఎంతగా ఇంప్రెస్ చేసిందో తెలిసిందే. అలాంటిది సంజయ్ దత్ లాంటి వాడు భయపెట్టే అవతారంలో ఈ పాత్ర చేస్తే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది. ఈ పాత్రను ఏకంగా ‘ఎవెంజర్స్’లోని థానోస్ పాత్రతో సంజయ్ దత్ పోల్చడం విశేషం.

నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా ‘ప్రస్థానం’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సంజుకి అధీర పాత్ర గురించి ప్రశ్న ఎదురవగా ఈ మాట అన్నాడు. ‘‘కేజీఎఫ్-2లో ఈ అధీర పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు అవెంజర్స్ సినిమా చూసి ఉంటే.. అందులో థానోస్‌ తెలిసే ఉంటాడు. అధీర కూడా అంతే శక్తిమంతమైన పాత్ర. కేజీఎఫ్ మొదటి ఛాప్టర్‌లో ఈ పాత్ర చివర్లో కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా భయంకరమైన గెటప్‌లో ఈ పాత్ర మీకు కనిపిస్తుంది. ఇలాంటి జోన్ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఇప్పటికి నాకు ఆ అవకాశం దక్కింది’’ అని సంజయ్ దత్ తెలిపాడు. సంజు ఈ రేంజిలో చెప్పాడంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో అన్న ఎగ్జైట్మెంట్ ప్రేక్షకులకు పెరిగిపోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English