జ‌గ‌న్ ఇలాకాలో బాబుకు ఎదురుదెబ్బ‌

జ‌గ‌న్ ఇలాకాలో బాబుకు ఎదురుదెబ్బ‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సొంత జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గిలింది.  ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడి పోయిన‌ప్ప‌టి నుంచి నేత‌లు ప‌లువురు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత వీర శివారెడ్డి  ఆ పార్టీకి రాజీనామా చేశారు.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో త్వరలో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వీరశివారెడ్డి ప్రకటించారు. ఈమేర‌కు ఆదివారం సాయంత్రం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డిం చారు.

ఈసంద‌ర్భంగా వీర‌శివారెడ్డి చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జా బ‌లంలేని వారికే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. క‌మ‌లాపురం టికెట్ త‌న‌కు ఇస్తాన‌ని చెప్పిన బాబు, ఆ త‌ర్వాత మాట మార్చార‌ని ఆరోపించారు. అందుకే ఎన్నిక‌ల్లో తాను, త‌న అనుచ‌రులు పార్టీ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ప‌నిచేశామ‌ని, వైసీపీ గెలుపున‌కు కృషి చేశామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అధిష్టానికి రాజీనామా లేఖను ఇప్పటికే పంపానని చెప్పిన ఆయన...జిల్లా అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్ప‌ష్టం చేశారు.

క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి టీడీపీ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. మాజీ ఎమ్మెల్సీ న‌ర‌సింహారెడ్డికి చంద్ర‌బాబు టికెట్ కేటాయించ‌డంతో వీర‌శివారెడ్డి అల‌క‌బూనారు. అప్ప‌టి నుంచి పార్టీలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. అదే స‌మ‌యంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియ‌ర్ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డితో విబేధాలు త‌లెత్తాయి. ఈప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త‌ ఎన్నిక‌ల‌కు ముందే వీర శివారెడ్డి టీడీపీని వీడుతార‌నే ప్ర‌చారం జిల్లాలో జోరుగా సాగింది. అయితే ఆయ‌న బీజేపీలో చేరుతారా..లేక వైసీపీలోకి వెళ్తారా అని ఇంత‌కాలం కొన‌సాగిన స‌స్పెన్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు వీర శివారెడ్డి.

అభివృద్ధిని కాంక్షించి ఎలాంటి షరతులు లేకుండానే తాను వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటన అనంతరం వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వీరశివారెడ్డి ప్రకటించారు. తన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు తమ క్యాడర్‌ అంతా వైఎస్సార్‌సీపీలో చేరుతుందన్నారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు కొంతమంది ప్రచారం చేశారని, తనకు ఆ ఆలోచన లేదని ఆయ‌న స్పష్టం చేశారు. కాగా వీర శివారెడ్డి రాజీనామాతో టీడీపీకి క‌డ‌ప జిల్లాలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English