ధనుష్ మీద ఎంత ప్రేమబ్బా

ధనుష్ మీద ఎంత ప్రేమబ్బా

ఇతనేం హీరో అన్న వాళ్లతోనే.. హీరో అంటే ఇతను అనిపించిన నటుడు ధనుష్. లుక్స్ పరంగా చాలా సాధారణంగా అనిపించే అతను.. తన నటనతోనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఉత్తరాది దక్షిణాది అని తేడా లేకుండా అందరి మనసులూ గెలిచాడు. బాలీవుడ్లో అతను నటించిన తొలి సినిమా ‘రాన్‌జానా’ ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే.

దాని తర్వాత ‘షమితాబ్’ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. నటుడిగా మాత్రం ధనుష్ మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఐతే ఆ సినిమా ఆడకపోవడంతో మళ్లీ బాలీవుడ్లో ధనుష్ కనిపించలేదు. ఇప్పుడు ఈ తమిళ హీరోను ఓ పెద్ద సినిమాతో మళ్లీ బాలీవుడ్‌కు తీసుకెళ్తున్నాడు దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్.

‘తను వెడ్స్ మను’ సిరీస్‌తో దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించిన ఆనంద్‌కు ధనుష్ మీద ప్రత్యేక అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే తనతో పని చేయడానికి ఎంతో ఆసక్తి చూపిన పెద్ద స్టార్లను కాదని ధనుష్‌తో ‘రాన్‌జానా’ తీశాడు. అతడిని ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ చేశాడు. ఇప్పుడు మరోసారి ధనుష్ కోసం పెద్ద ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అతడి అభిమానులకు ఆనందాన్నిచ్చే తీపి కబురు చెప్పాడు ఆనంద్.

హృతిక్ రోషన్-ధనుష్-సారా అలీ ఖాన్ కలయికలో తానొక మల్టీస్టారర్ మూవీ తీయబోతున్నట్లు మీడియాకు సమాచారం అందించాడు. హృతిక్ లాంటి పెద్ద స్టార్‌తో కలిసి ధనుష్ నటిస్తే ఆ సినిమా అతడికెంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఫిజిక్ పరంగా పూర్తి భిన్నంగా కనిపించే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం ఆసక్తిని రేకెత్తించేదే. ఇది కచ్చితంగా కథాబలంతో తెరకెక్కే సినిమానే అయ్యుంటుందని అంచనా. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English