‘మ‌హాభార‌తం’లో ఎన్టీఆర్ – చరణ్


తన కలల ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల నుంచి చెబుతూ వస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. మరి ఆ సినిమా ఎఫ్పుడు అని అంటే మాత్రం.. ఆ సినిమా తీయడానికి అపార అనుభవం కావాలని, ఇంకా ఆ స్థాయి అనుభవం తనకు రాలేదని.. అది వచ్చింది అనుకున్నాక భవిష్యత్తులో ఆ చిత్రం చేస్తానని పలుమార్లు చెప్పాడు. ఇంకో ప‌దేళ్ల త‌ర్వాత ఆ మెగా  మూవీ తీయొచ్చ‌ని అయిదారేళ్ల కింద‌ట చెప్పాడు జ‌క్క‌న్న‌.

ఆయ‌న చెప్పిన లెక్క ప్ర‌కారం ఇంకో మూణ్నాలుగేళ్ల‌లో త‌న క‌ల‌ల ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించొచ్చేమో. ఐతే ఆ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు ఎవ‌రు పోషిస్తార‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. క‌చ్చితంగా వివిధ ఇండ‌స్ట్రీల‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుల‌ను ప్ర‌ధాన పాత్ర‌ల‌కు తీసుకోవ‌చ్చు. కాగా ఇందులో ముందుగా పాత్ర‌లు బుక్ అయింది మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కే. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలిద్దరూ మహాభారతం ప్రాజెక్టులో భాగం కాబోతున్న‌ట్లు రాజ‌మౌళి స్వ‌యంగా వెల్ల‌డించ‌డం విశేషం.

ఐతే ఆయన తనకు తానుగా ఈ ప్రకటన చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఒకదాంట్లో తారక్, చరణ్ కలిసి రాజమౌళిని ఉడికిస్తూ ‘మహాభారతం’లో తమ ఇద్దరికీ అవకాశం ఇస్తారా అని అడిగారు. దీనికి జక్కన్న బదులిస్తూ.. వాళ్లిద్దరూ ఆ సినిమాలో ఉంటారని పేర్కొన్నాడు ఐతే వారి పాత్రలేంటి అన్నది ఇప్పుడు చెప్పలేనని అన్నాడు.

తాను తీయబోయే మహాభారతంలో ఇప్పటిదాకా చదువుకున్నట్లు, వివిధ సినిమాల్లో చూసినట్లు పాత్రలు ఉండవని..  ఆయా పాత్రల్ని, ఈ కథను తన శైలిలో చూపించే ప్రయత్నం చేస్తానని.. ఆయా క్యారెక్టర్లు, వాటి మధ్య కనెక్షన్‌కు సంబంధించి పరిధి పెంచి చూపాలన్నది తన ఉద్దేశమని కూడా జక్కన్న చెప్పాడు. బహుశా మహేష్ బాబు సినిమాతో తర్వాతి చిత్రంగానో లేదా ఆ తర్వాతి మూవీగానో ‘మహాభారతం’ను రాజమౌళి తెరకెక్కించే అవకాశాలున్నాయి.