సినిమా సంగతి చెప్పకుండా కోట్స్ ఏంటి నిఖిల్?

సినిమా సంగతి చెప్పకుండా కోట్స్ ఏంటి నిఖిల్?

యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ కెరీర్ ఇప్పుడు అయోమయ స్థితిలో ఉంది. ఎప్పుడో విడుదలకు సిద్ధమైన ‘అర్జున్ సురవరం’ సినిమా పక్కన పడిపోయింది. షూటింగ్ మధ్యలో ఉన్న ‘శ్వాస’ అనే సినిమా ఆగిపోయింది. కొత్తగా అనుకున్న ‘కార్తికేయ-2’ అనుకున్న ప్రకారం పట్టాలెక్కట్లేదు.

మధ్యలో ఆగిన సినిమా.. మొదలు కావాల్సిన సినిమా సంగతి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ కాపీతో రెడీ అయి.. ఇంకో వారంలో రిలీజ్ అనుకుని.. ప్రమోషన్లు కూడా గట్టిగా చేశాక ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’తో పోటీ ఎందుకుని వాయిదా పడ్డ ‘అర్జున్ సురవరం’ సంగతే ఎటూ తేలకుండా పోవడం విచారకరం. ‘ఎవెంజర్స్’తో పోటీ వద్దనుకున్నాక.. దాదాపు మూడు నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ ఈ చిత్రానికి మోక్షం కలగలేదు.

కనీసం అరడజనుసార్లు ఈ సినిమా వాయిదా పడ్డ నేపథ్యంలో నిఖిల్ తీవ్ర అసహనానికి గురైనట్లున్నాడు. ఈ సినిమా ప్రస్తావన తెస్తే రిలీజ్ ఎప్పుడు అని ఫాలోవర్లు వాయించేస్తుండటంతో దాని గురించి ట్విట్టర్లో మాట్లాడ్డం కూడా మానేశాడు.

ఐతే తాజాగా ‘అర్జున్ సురవరం’ నుంచి ఒక స్టిల్ రిలీజ్ చేసి నర్మగర్భమైన కామెంట్ ఒకటి పెట్టాడు. ‘‘కొన్నిసార్లు స్వచ్ఛంగా బయటికి రావాలంటే కాలక తప్పదు’’ అన్నది ఇంగ్లిష్ కోట్ సారాంశం. ఐతే ఈ ట్వీట్ కింద అందరూ.. ఇంతకీ సినిమా సంగతేంటి బాసూ అని అడిగిన వాళ్లే. బయ్యర్ల కోరిక మేరకు ‘ఎవెంజర్స్’తో పోటీ ఎందుకుని వాయిదా వేసినట్లుగా నిఖిల్ చివరగా డేట్ మార్చడానికి కారణం చెప్పాడు. ఆ తర్వాత కూడా సినిమా వెలుగు చూడకపోవడానికి కారణాలేంటో అంతు బట్టడం లేదు.

మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇదని చాలా నమ్మకంతో ఉన్న చిత్ర బృందం.. ఇలా సినిమాను పక్కన పడేసి ఉన్న క్రేజ్‌ను కూడా ఎందుకు దెబ్బ తీసుకుంటోందో.. ఈ చిత్రం ఎందుకు బయటికి రావడం లేదో అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English