స్పైడ‌ర్ మ్యాన్ బాక్సాఫీస్ బీభత్సం!

క‌రోనా దెబ్బ‌కు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ డ‌ల్ అయిపోయింది. హాలీవుడ్ సినిమాల మీదా వైర‌స్ ప్ర‌భావం బాగా ప‌డింది. గ‌త ఏడాది వ్య‌వ‌ధిలో రిలీజైన హాలీవుడ్ సినిమాలేవీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయాయి. నిరుడు వ‌చ్చిన భారీ చిత్రం టెనెట్ మంచి రివ్యూలు తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ స‌హా కొన్ని చిత్రాలు ఓ మోస్త‌రు వ‌సూళ్లు తెచ్చుకున్నాయి కానీ.. మామూలుగా హాలీవుడ్ భారీ సినిమాల స్థాయిలో అయితే వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయాయి.

కానీ గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స్పైడ‌ర్ మ్యాన్: నో వే హోమ్ మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు రేపింది. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా ఓపెనింగ్స్ సాధించింది. తొలి వారాంతంలోనే దాదాపు 600 మిలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టి బాక్సాఫీస్ పండిట్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసిందా చిత్రం. 

ఇప్పుడు స్పైడ‌ర్ మ్యాన్ మ‌రింత గొప్ప మైలురాయిని అందుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ ప‌ది రోజుల్లోనే స్పైడ‌ర్ మ్యాన్ బిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అంటే రూపాయ‌ల్లో 7500 కోట్లకు పైమాటే అన్న‌మాట‌. ప‌ది రోజుల్లో ఈ స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అసామాన్య‌మైన విష‌యం. అందులోనూ క‌రోనా త‌ర్వాత వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ వ‌సూళ్లు చాలా వ‌ర‌కు త‌గ్గాయి.

ఇలాంటి స్థితిలో ఈ స్థాయి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అద్భుత‌మే. మార్వెల్ సినిమాల నుంచి ప్రేక్ష‌కులు ఆశించే యాక్ష‌న్ ఘ‌ట్టాలు, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఈ చిత్రంలో ఏమాత్రం లోటు లేదు. ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేలా సినిమా ఉండ‌టంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుత ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇండియాలో ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ మార్కు దిశ‌గా అడుగులు వేస్తుండ‌టం విశేషం. ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం 500 మిలియ‌న్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.