ఒకే వేదిక‌పై సీజేఐ, ఏపీ సీఎం

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. మూడు రోజుల పాటు రాష్ట్ర ప‌ర్య‌ట‌న నిమిత్తం స‌తీమ‌ణి శివ‌మాలతో క‌లిసి వ‌చ్చిన ఆయ‌న ఈ రోజు.. ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌లు ఒకే వేదిక‌ను పంచుకున్నారు.

ఒకే వేదిక‌పై రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు కూడా సీఎంతో క‌లిసి కూర్చోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా క్రిస్మ‌స్‌.. నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కేక్ క‌ట్ చేశారు. తొలుత కేక్ క‌టింగ్ ఘ‌ట్టానికి.. సీఎం జ‌గ‌న్ దూరంగా ఉన్నారు. అయితే.. సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణే.. సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. దీంతో ఆయ‌న సీజేఐ చేతిమీద చేయి వేసి.. కేక్ క‌ట్ చేశారు.

ఈ ఘ‌ట‌న చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యం లో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి, రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఒడిసా రాష్ట్రాల హైకోర్టుల నుంచి కూడా ప‌లువురు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు. తొలుత ఈ కార్య‌క్ర‌మంలో భారీ పుష్ప గుచ్ఛం ఇచ్చి.. సీఎం జ‌గ‌న్‌.. సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ‌ను ఘ‌నంగా స్వాగ‌తించారు. అనంతరం.. వేదిక‌పైనే ఇత‌ర న్యాయ‌మూర్తుల‌తో క‌లిసి.. సీఎం, సీజేఐలు తేనీరు సేవించారు. త‌ర్వాత‌.. కేక్ క‌ట్ చేశారు. అంతకుముందు నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్‌ జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

వైఎస్సార్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్‌.. నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐని కలిసి తేనీటి విందుకు ఆహ్వానించారు. వాస్త‌వానికి ప్ర‌బుత్వాలు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు న్యాయ‌మూర్తులు హాజ‌రు కావ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. పైగా.. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొంటుండ‌డం, గ‌తంలో జైలు చేసిన ప‌రిస్థితి కూడా ఉండ‌డం, ఇప్ప‌టికీ అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి.. విచార‌ణ‌లు ఎదుర్కొంటున్న త‌రుణంలో ఏపీ సీఎం జ‌గ‌న్ హాజ‌ర‌య్యే కార్యక్ర‌మానికి సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు.