దర్శకుడిని టార్చర్ పెట్టిన నాగ్

దర్శకుడిని టార్చర్ పెట్టిన నాగ్

తన కొత్త సినిమా ‘మన్మథుడు-2’ను ప్రమోట్ చేయడానికి చాలా విన్యాసాలే చేస్తున్నాడు అక్కినేని నాగార్జున. యూత్‌కు కనెక్టయ్యే ట్రెండీ మార్గాల్ని ఆయన టీం ఎంచుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘ఫేస్ యాప్’ను ఉపయోగించుకుని ఈ సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే దానికి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

ఇప్పుడు నాగ్ అండ్ టీం కొత్త ఐడియాతో వచ్చింది. త్వరలోనే ‘బిగ్ బాస్’గా రాబోతున్న నాగ్.. తన సినిమా ప్రమోషన్ కోసం కూడా బిగ్ బాస్ లాగే మారి దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు టాస్కులు ఇచ్చాడు. ‘మన్మథుడు-2’ షూటింగ్ పోర్చుగల్‌లో జరిగినపుడు నాగ్, రాహుల్ తదితరులు వారం రోజుల పాటు ఒక రెస్టారెంటుకు వెళ్లి ఒకే ఐటెం తిన్నారట.

అదే ఐటెంను హైదరాబాద్‌లో తీసుకురా అంటూ ఒక రెస్టారెంటుకు పంపించాడు నాగ్. అంతటితో ఆగకుండా రెస్టారెంటుకు వెళ్లి తాను ఏం చెబితే అది చేయమన్నాడు. బ్లూ టూత్‌ చెవిలో పెట్టుకుని నాగ్ సూచనలు పాటిస్తూ సాగిపోయాడు రాహుల్.

ఐతే నాగ్ అంత తేలికైన టాస్కులేమీ ఇవ్వలేదు. రెస్టారెంటులోకి వెళ్లి నేనే మన్మథుడు-2 డైరెక్టర్ అని అరిచి చెప్పు.. ఆ టేబుల్ మీద కూర్చుని ఉన్న కుర్రాళ్ల దగ్గరికెళ్లి వాళ్ల జ్యూస్ తీసుకుని తాగేయ్.. తనకు కావాల్సిన ఐటెం ఇవ్వని వెయిటెర్ మీద కేకలు వెయ్.. ఎదురుపడ్డ అమ్మాయి దగ్గరికెళ్లి ఫ్లర్ట్ చెయ్యి అంటూ రాహుల్‌ను టార్చర్ పెట్టే టాస్కులిచ్చాడు. రాహుల్ ఆయన చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లి చివర్లో రెస్టారెంట్ వాళ్లకు ఇది ప్రాంక్ వీడియో అని చెప్పాడు. అంతా ఓకే కానీ.. ఈ వీడియో వల్ల సినిమాకు ఏమంత ప్రమోషన్ వచ్చేసిందన్నది అర్థం కాని విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English