వెరైటీ కాంబో.. రవితేజతో సిద్దార్థ్

వెరైటీ కాంబో.. రవితేజతో సిద్దార్థ్

రవితేజ అనగానే ఊర మాస్ పాత్రలు.. సినిమాలు గుర్తుకొస్తాయి. ఆయనకు ‘మాస్ రాజా’ అనే పేరు కూడా ఉంది. ఇక సిద్దార్థ్ అనగానే పక్కా క్లాస్ క్యారెక్టర్లు, క్లాస్ సినిమాలే తలపులోకి వస్తాయి. అతడికి ‘చాక్లెట్ బాయ్’ అనే పేరుంది. ఇద్దరిదీ పూర్తి భిన్నమైన ఇమేజ్, లుక్. వీళ్లు చేసే సినిమాలు కూడా పూర్తి భిన్నమే. ఇలాంటి ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? త్వరలోనే ఈ వెరైటీ కాంబో తెరమీదికి రాబోతున్నట్లు సమాచారం. ‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి వీళ్లిద్దరి కలయికలో ఈ సినిమా చేయబోతున్నాడట. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ సినిమా అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కూడా తన రెండో సినిమాను కన్ఫమ్ చేయలేదతను.

ఎట్లకేలకు అజయ్ రెండో సినిమా ఖరారైందని.. రవితేజ, సిద్దార్థ్‌ల కలయికలో ఒక వైవిధ్యమైన మల్టీస్టారర్ తీయబోతున్నాడని సమాచారం. ఇంతకుముందు ప్రచారంలో ఉన్న ‘మహాసముద్రం’ అనే స్క్రిప్టుతోనే ఈ సినిమా ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. రవితేజ-సిద్ధు-అజయ్‌ల కాంబినేషన్ కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మాస్ రాజా.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలోో ‘డిస్కోరాజా’ అనే సినిమా చేస్తున్నాడు. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి.. ఆ తర్వాత తమిళంలోకి వెళ్లిపోయిన సిద్ధు అక్కడ కూడా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘బిచ్చగాడు’ దర్శకుడితో సిద్ధు చేసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English