నాగార్జున కూడా ఆ కేటగిరీలో చేరిపోయాడా?

నాగార్జున కూడా ఆ కేటగిరీలో చేరిపోయాడా?

ఈ మధ్య సినిమాలకు హైప్ పెంచడం కోసం బిజినెస్ లెక్కలు పెద్దవి చూసి చూపించడం.. ఘనంగా ప్రకటనలు ఇవ్వడం మామూలైపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమాకూ ఇదే జరుగుతుంటుంది. ఈ మధ్య ‘సైరా’ సినిమా కర్ణాటక హక్కులకు సంబంధించి ఆ చిత్ర బృందం సైతం ఇలాగే చేసిందన్న గుసగుసలు వినిపించాయి. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ఫిగర్స్ కూడా కొంచెం అతిగానే అనిపించాయి.

చూస్తుంటే ఇండస్ట్రీ జనాలందరూ ఇదే బాటను అనుసరిస్తున్నట్లుంది. అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘మన్మథుడు-2’ నాన్-థియేట్రికల్ రైట్స్ గురించి వినిపిస్తున్న కబురు ఇదే సందేహాలు రేకెత్తిస్తోంది. ఈ చిత్ర శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కలిపి రూ.24 కోట్లు పలికినట్లుగా చిత్ర బృందం వెల్లడించింది. కానీ నాగార్జున మార్కెట్ గత కొన్నేళ్లుగా పడిపోతూ వస్తోంది తప్ప.. పెరగట్లేదు.

ఆయన సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌కు ఈ రేంజిలో రేటు పలికిందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. పోయినేడాది ‘ఆఫీసర్’ సినిమాతో కెరీర్లో ఊహించని పతనం చూశాడు నాగ్. దాని తర్వాత ‘దేవదాస్’ లాంటి క్రేజీ మూవీ చేస్తే అది కూడా అంచనాల్ని అందుకోలేదు. ముందు రెండు సంవత్సరాల్లోనూ డిజాస్టర్లే ఎదురయ్యాయి. అలాంటి హీరో సినిమాకు ఈ ధర ఎలా పలుకుతుందన్నది ఆశ్చర్యకరం. దీని తర్వాత థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ ఇలాగే ఫిగర్స్ ఎక్కువ చేసి చూపిస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రోమోలు మిక్స్డ్‌ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అవి యూత్‌ను ఆకట్టుకున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభ్యంతరకరంగా అనిపించాయి. ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English