తేజకు, నితిన్‌కు చెడింది అక్కడా?

తేజకు, నితిన్‌కు చెడింది అక్కడా?

నితిన్‌కు హీరోగా లైఫ్ ఇచ్చింది దర్శకుడు తేజ. ‘జయం’ సినిమాతో అతడికి అరంగేట్రంలోనే తిరుగులేని విజయాన్నందించాడు. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో ‘ధైర్యం’ అనే ఇంకో సినిమా వచ్చింది. కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి మరో సినిమా చేయలేదు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. తేజ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా నితిన్‌ గురించి మాట్లాడటానికి ఇష్టపడడు.

‘జయం’ వార్షికోత్సవాల సమయంలో నితిన్ మాత్రం ఒక ట్వీట్ వేస్తుంటారు. ఇంతకీ ఇద్దరి మధ్య అసలేంటి గొడవ అనేది అర్థం కాదు. తాను పరిచయం చేసిన వాళ్లలో మంచి స్థాయిని అందుకున్న ఉదయ్ కిరణ్, కాజల్ అగర్వాల్‌ లాంటి వాళ్ల గురించి తేజ చాలా పాజిటివ్‌గా మాట్లాడతాడు కానీ.. నితిన్ ప్రస్తావన తేడు. కృతజ్ఞత లేని వాళ్లంటూ ఆయన పరోక్షంగా దెప్పిపొడిచే వాళ్లలో నితిన్ కూడా ఉన్నాడనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి.

అసలింతకీ వీళ్ల మధ్య గొడవ ఏంటి అనేది తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో తేజ వెల్లడించాడు. ‘ధైర్యం’ సినిమా రిలీజ్ టైంలో తనకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి ఎలా చెడిందో ఆయన వివరించాడు. ఈ సినిమా మీద తేజకే నమ్మకాలు లేవట. అలాంటి సమయంలో తనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనడానికి వచ్చాడని.. తాను తీసిన ‘జయం’ కొన్నానని, ఇప్పుడు ‘ధైర్యం’ కూడా కొనబోతున్నానని చెప్పాడని.. ఐతే తాను ‘భార్యా పిల్లలూ అంతా బాగున్నారా.. అయితే మీ ఇష్టం’ అన్నానని.. తన టైమింగ్ క్యాచ్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనకుండా వెళ్లిపోయాడని తేజ వెల్లడించాడు.

రిలీజ్ తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ తాను సినిమాను కొనొద్దని చెప్పినట్లు నిర్మాతకు చెప్పాడని.. దీంతో వాళ్లు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారని చెప్పాడు. ఈ విషయమై విచారణ జరిపారని.. సినిమా కొనొద్దని మీరు చెప్పారా అని అడిగితే.. ‘నేను అలా అనలేదు. భార్యాపిల్లలు జాగ్రత్త’ అని మాత్రమే చెప్పానని.. దానర్థం అదే కదా అంటూ కోటి రూపాయలు పరిహారం కట్టమన్నారని.. తాను ఆ చిత్రానికి రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటే అందులో సగం వెనక్కి ఇచ్చేశానని చెప్పాడు తేజ. ఎవరి పేర్లూ ఎత్తలేదు కానీ.. ఈ చిత్రాన్ని నిర్మించింది నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డే కాబట్టి తేజ కోపం ఎవరి మీద అన్నది స్పష్టంగా తెలిసిపోయింది. తాను పరిచయం చేసి లైఫ్ ఇస్తే.. తనతో ఇలా పరిహారం కట్టించుకోవడం తేజకు చాలా కోపం తెప్పించినట్లే ఉంది. అందుకే నితిన్ పట్ల ఆయనకు అంత వ్యతిరేకత అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English