అల్లు అర్జున్‌ కథ కావాలంటున్న హవీష్‌

అల్లు అర్జున్‌ కథ కావాలంటున్న హవీష్‌

నటుడిగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, స్వీయ నిర్మాణం వల్ల ఎన్నో కోట్లు గల్లంతయినా కోనేరు హవీష్‌ ఇంకా గజిని మొహమ్మద్‌లా వెండితెరపైకి దండెత్తడం మానడం లేదు. ఇటీవలే 7 అనే సినిమాపై పదకొండు కోట్లు పోగొట్టుకున్నాడని ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకున్నారు. అయితే చిన్నా చితకా దర్శకుల మీద అయిదు, పది కోట్లు వెచ్చించడం కంటే ఒకటేసారి ఒక పెద్ద దర్శకుడితో భారీ సినిమా తీసి అమీ తుమీ తేల్చుకోవాలని అతను డిసైడ్‌ అయ్యాడు. అందుకే తమిళ దర్శకుడు లింగుస్వామితో ఒక బైలింగ్వల్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

అల్లు అర్జున్‌తో అప్పట్లో లింగుస్వామి డైరెక్షన్‌లో ఒక సినిమా అనౌన్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ప్రారంభోత్సవం కూడా చేసారు కానీ అల్లు అర్జున్‌ దానిని పూర్తిగా పక్కన పెట్టాడు. అల్లు అర్జున్‌ కోసం లింగుస్వామి అనుకున్న ఆ కథ తనకి కావాలని హవీష్‌ అడుగుతున్నాడట. లింగుస్వామికి గతంలో వున్న క్రేజ్‌ ఇప్పుడయితే లేదు. అతనికి అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ ఆఫర్లు లేవు. హవీష్‌తో సినిమా తీస్తే తనకీ భారీ పారితోషికం ముడుతుంది కాబట్టి అతను ఈ అవకాశాన్ని వదులుకోక పోవచ్చు. బాక్సాఫీస్‌పై అలుపెరగని దండయాత్ర కొనసాగిస్తోన్న ఈ గజినికి ఈ బృహత్తర ప్రయత్నంతో అయినా అంబ పలుకుతుందా లేక మళ్లీ మరో ప్రయత్నం చేయనివ్వకుండా పంబ పగులుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English