శ్రీదేవి మరణంపై మళ్లీ రగడ

శ్రీదేవి మరణంపై మళ్లీ రగడ

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. ఇంకా కూడా ఆమె మరణం మీద సందేహాలు తొలగిపోలేదు. దుబాయిలోని ఓ హోటల్లో శ్రీదేవి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆమె మృతిపై రకరకాల సందేహాలు రేకెత్తాయి. కానీ దుబాయ్ పోలీసులు శ్రీదేవిది సహజ మరణమేనని నిర్ధరించి ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఇండియాకు పంపించేశారు. కొన్ని రోజుల తర్వాత జనాలు ఈ విషయమే మరిచిపోయారు. మధ్యలో శ్రీదేవి మరణంపై సందేహాలతో కొన్ని కథనాలు వెలువడ్డాయి కానీ.. అటు దుబాయ్ పోలీసులు కానీ.. ఇటు ఇండియా పోలీసులు కానీ దీనిపై ఏమీ స్పందించలేదు.

ఐతే ఇప్పుడు మళ్లీ శ్రీదేవిది హత్యే అంటూ కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీ రిషిరాజ్‌ సింగ్‌ ఓ దినపత్రికకు రాసిన వ్యాసంలో సందేహాలు వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. శ్రీదేవి మరణంలో కుట్రకోణం దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫొరెన్సిక్‌ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్‌ తనతో పంచుకున్నారని ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

‘ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నప్పటికీ అడుగు లోతు ఉండే నీటితొట్టెలో పడి చనిపోవడం అసాధ్యం. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తిపట్టి తలను నీటిలో ముంచి ఉంటారని.. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే అవకాశం లేదు’ అంటూ ఉమాదత్తన్‌ తనతో చెప్పినట్లు రిషిరాజ్‌ సింగ్‌ వివరించారు. అయితే ఉమాదత్తన్‌ ఇటీవలే మరణించినట్లు రిషిరాజ్‌ సింగ్‌ తెలపడం గమనార్హం. రిషి రాజ్ వ్యాసంపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్పందించాడు. ఇవన్నీ ఊహజనితమైన కట్టు కథలేనన్నాడు. ఇలాంటి మూర్ఖమైన వార్తల్ని ఎవరో ఒకరు పుట్టిస్తూనే ఉంటారని, అలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English