పిల్లలతో విదేశాలకు ఎందుకు వెళుతున్నారంటే?

ఈమధ్య మనదేశం నుండి రెగ్యులర్ గా కొందరు విదేశాలకు వెళుతున్నారు. మనదేశం నుండి విదేశాలకు వెళ్ళటం మామూలే. కానీ కొద్ది రోజులుగా పిల్లలను తీసుకుని తల్లి, దండ్రులు మరీ విదేశాలకు వెళ్ళొస్తున్నారట. నెల రోజుల ట్రిప్పులకైనా సరే తక్కువలో తక్కువ రు. 3 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నారట. ఎందుకిలా పిల్లలతో వెళ్ళి అంతంత డబ్బు ఖర్చులు పెట్టుకుని వస్తున్నారు ? ఎందుకంటే కరోనా వైరస్ భయంతోనేనట.

మనదేశంలో చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన రాకపోయినా స్కూళ్ళు మాత్రం తెరిచేశారు. ఇష్టం ఉన్నవాళ్ళు స్కూళ్ళకు రావచ్చని స్కూళ్ళ యాజమాన్యాలు చెబుతున్నా పిల్లలు ధైర్యంచేసి స్కూళ్ళకు వచ్చేస్తుండటంతో పేరంట్సులో కరోనా వైరస్ భయం పెరిగిపోతోందట. దానికితోడు కొద్దిరోజులుగా ఒమిక్రాన్ విజృంభణ ఒకటి. దాంతో డబ్బులు ఖర్చు చేసుకోగలిగిన వాళ్ళు తమ పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్ళి వ్యాక్సిన్ వేయించేస్తున్నారు.

అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, ఫ్రాన్స్, సింగపూర్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో చిన్న పిల్లలకు కోవిడ్ టీకాలు చాలా కాలంగా వేస్తున్నారు. పైగా చాలా దేశాల్లో మనదేశంలో ఉన్నంత డిమాండ్ కూడా టీకాలకు లేదు. దాంతో టీకాలు వేయించుకోవాలని అనుకునేవాళ్ళకు చాలా తేలిగ్గానే దొరొకేస్తోంది. అందుకనే సంపన్నులు తమ పిల్లలను తీసుకుని ఓ నెల రోజులు సరదగా గడిపినట్లుంటుంది అలాగే టీకాలు వేయించేసినట్లుంటుందని విదేశాలకు వెళ్ళిపోతున్నారు.

విదేశాల్లోనే టీకాలు వేయించిన తర్వాత అబ్జర్వేషన్ కోసం అక్కడే కొద్దిరోజులుంటున్నారు. పనిలోపనిగా సైట్ సీయింగ్ కూడా కానిచ్చేస్తున్నారు. అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నట్లుగా. ఇక మూడో పిట్టకూడా ఉందట. అదేమిటంటే ఇప్పటికే రెండు డోసులు వేసుకున్న పెద్దవాళ్ళు  బూస్టర్ డోసు కింద మూడో డోసు కూడా వేయించేసుకుంటున్నారట. మరి మనదగ్గర చిన్న పిల్లలకు టీకాలు వేయించే విషయంలో ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో, వ్యాక్సిన్ ఎప్పుడు రెడీ అవుతుందో అని అందరు ఎదురు చూస్తున్నారు. అప్పటివరకు విదేశాలే గతేమో.