బన్నీ బడాయి ఎక్కువైపోలా..

బన్నీ బడాయి ఎక్కువైపోలా..

అల్లు అర్జున్‌ను అతడి పీఆర్ టీం ‘సోషల్ మీడియా కింగ్’ అని అంటుంటుంది. సోషల్ మీడియాలో బన్నీ తనను తాను ప్రమోట్ చేసుకునే తీరు చూస్తే అతడికీ ట్యాగ్ తగిలించడం సబబే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో అభిమాన సంఘాల్ని మేనేజ్ చేయడంలో.. బన్నీకి సంబంధించి సినిమా, వ్యక్తిగత విశేషాల్ని ప్రమోట్ చేయడంలో అతడి టీం ఎత్తుగడలే వేరుగా ఉంటాయి.

బన్నీ ఏదైనా సినిమా చూసి దాని టీంను అభినందించినా.. ఏదైనా వేడుకకు హాజరైనా.. బయట ఏదైనా వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్నా దాన్ని ఓ రేంజిలో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటారు. ఈ మధ్య ‘బ్రోచేవారెవరురా’; ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి చిన్న సినిమాల్ని చూసి వాటి బృందాల్ని అభినందిస్తే అది పెద్ద వార్త అయింది. ‘ఓ బేబీ’ చూసి సమంతకు ఫోన్ చేసి అభినందిస్తే దాని గురించి కూడా ఊదరగొట్టేశారు. ఇక బన్నీ అభిమాన సంఘాల పేరుతో నడిచే సోషల్ మీడియా అకౌంట్లను ఎంత పక్కాగా మెయింటైన్ చేస్తారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

దసరా టైంలో బన్నీ పల్లెటూరికి వెళ్లినా అభిమానుల్ని మొబిలైజ్ చేసి పీఆర్ టీం చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఇలా బన్నీ వ్యక్తిగత విషయాల్ని  కూడా గ్లోరిఫై చేసి మీడియాలో కవరేజీ ఇప్పిస్తుంటారు. సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తుంటారు. తాజాగా బన్నీ వ్యానిటీ వ్యాన్ ‘ఫాల్కన్’ గురించి సామాజిక మాధ్యమాల్లో ఎంత హడావుడి నడుస్తోందో తెలిసిందే. ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఈ వ్యాన్ డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. దీని గురించి బన్నీ ట్వీట్ చేస్తూ ఫొటోలు షేర్ చేయడమే విచిత్రం. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది కానీ.. వాళ్లకు వాళ్లుగా ఈ విశేషాలు పంచుకుంటే బడాయి పోతున్నట్లు ఉంటుంది.

ఇంత లగ్జరీ ఏంటి అని మామూలు జనాలు నెగెటివ్‌గా చూస్తారు. మొన్న బన్నీ ఫొటోలు పంచుకోవడమే ఎక్కువ అనుకుంటే.. తాజాగా ఒక టీవీ ఛానెల్‌ ఈ వ్యానిటీ వ్యాన్ మీద పది నిమిషాల ప్రోగ్రాం చేసేసింది. వ్యానిటీ వ్యాన్ లోపలికి వెళ్లి అందులో అణువణువునూ పరిచయం చేస్తూ అతిశయాలు పోతూ స్టోరీ చేశారు. ఇది బన్నీ టీం ప్లాన్ చేసి చేయించిన స్టోరీ అన్నది స్పష్టం. ఐతే ఇది చూసిన జనాలకు బన్నీ బడాయి పోతున్నాడనే నెగెటివ్ ఫీలింగ్ కలగకుండా ఉంటుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English