ప్రభాస్‌ను ఎవ్వరూ లెక్క చేయట్లేదు

ప్రభాస్‌ను ఎవ్వరూ లెక్క చేయట్లేదు

ఈ ఏడాదికి ఇండియాలో అతి పెద్ద బడ్జెట్, అత్యధిక అంచనాలు ఉన్న సినిమా ‘సాహో’నే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీగానే అంచనాలుున్నాయి. ఒక సినిమా అనుభవమున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నప్పటికీ దీని స్కేల్ తక్కువేమీ కాదు. వివిధ భాషలకు చెందిన పెద్ద ఆర్టిస్టులు.. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.

ఇటీవలే రిలీజైన టీజర్ చూశాక సినిమా ఒక రేంజిలో ఉంటుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వివిధ భాషల్లో వేరే సినిమాలేవీ పోటీకి రావనే అనుకున్నారంతా. కానీ అటు హిందీ, ఇటు తమిళంలో ‘సాహో’కు పోటీగా సినిమాల్ని ధైర్యంగా నిలబెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

హిందీలో ఇప్పటికే అక్షయ్ కుమార్ మూవీ ‘మిషన్ మంగల్’ను ఆగస్టు 15కి ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమాను ఓ రేంజిలో పొగిడేస్తూ రిలీజ్ డేట్‌ను స్వయంగా ప్రకటించాడు అక్షయ్ కుమార్. ఇది చాలదన్నట్లు తాజాగా జాన్ అబ్రహాం సినిమా ‘బాట్లా హౌస్’ను కూడా ఆగస్టు 15కి ఖరారు చేశారు. రిలీజ్ డేట్‌తో పోస్టర్ కూడా వదిలారు. అక్షయ్ అయినా పెద్ద హీరో.. జాన్‌కు అంత రేంజ్ లేదు. అయినా అతను ‘సాహో’కు ఎదురెళ్లడానికి రెడీ అయిపోయాడు.

మరోవైపు తమిళంలో కూడా ఇండిపెండెన్స్ డేకి ఒక సినిమా విడుదల ఖాయం చేసుకుంది. అదే జయం రవి, కాజల్ జంటగా నటిస్తున్న ‘కోమలి’. మరోవైపు మలయాళంలో సైతం ఆగస్టు 15కి ఒకట్రెండు సినిమాలు రేసులో నిలుస్తాయని అంటున్నారు. ‘సాహో’పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నప్పటికీ భయం లేకుండా ఇలా సినిమాల్ని పోటీలో నిలపడం ఆశ్చర్యమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English