జ‌గ‌న్ పుట్టిన రోజు.. రెచ్చిపోయిన కార్య‌క‌ర్త‌లు

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించారు. అయితే. ఈ వేడుక‌ల్లో కొన్ని చోట్ల‌.. కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. త‌మ‌దే రాజ్యం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. మ‌ద్యం తాగడం, విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రించ‌డం.. దారిన పోతున్న‌వారిని బెదిరించ‌డం.. క‌ర్ర‌లతో బాద‌డం.. వంటి అకృత్యాలకు ఒడిగ‌ట్టారు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట‌లో సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మందు పార్టీ చేసుకున్నారు.

ప‌ట్ట‌ప‌గ‌లే.. మ‌ద్యం తాగిన‌.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ర్యాలీ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పలు కళాశాలల విద్యార్థు లను కూడా  ర్యాలీలో పాల్గొనాల‌ని ఒత్తిడి చేశారు. దీంతో విధిలేని ప‌రిస్థితిలో వారంతా పాల్గొన్నారు. అ యితే.. ర్యాలీలో డీజే పాటల వ్యవహారం విద్యార్థులకు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు మధ్య కొట్లాటకు దారి తీసింది. ఒక వర్గం విద్యార్థులపై కార్య‌క‌ర్త‌లు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు విద్యార్థులను చిత‌క‌బాదారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వైద్యశాలకు తరలించారు.  

మ‌రోవైపు.. నరసరావుపేటలోనే బ‌స్టాండు సెంట‌ర‌లో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.  నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు యువకులను మద్యం మత్తులో వైసీపీ కార్య‌క‌ర్త‌లు కర్రలతో చితకొట్టారు.  దీంతో ఒక్క సారిగా అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యం ఎవరికీ అర్ధం కాలేదు. పెద్ద పెద్ద క‌ర్ర‌ల‌తో విరుచుకుప‌డిన కార్య‌క‌ర్త‌ల నుంచి త‌ప్పించుకునేందుకు పాద‌చారులు, వాహ‌న దారులు సైతం ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్యక్తులకు గాయాల‌య్యాయి. ఆసుపత్రికి తరలించారు.

అయితే.. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పైనా.. స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే.. ప్ర‌శాంతంగా చేసుకోవాల‌ని.. మ‌ద్యం తాగి ఇష్టానుసారంగా రోడ్ల‌పై వీరంగం వేస్తారా? అని నిల‌దీస్తున్నారు. సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు అయినంత మాత్రాన రోడ్ల‌పై ప‌డి.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌ను చేయాల‌ని చెప్పారా? అంటూ.. నిల‌దీస్తున్నారు. ప్రస్తుతం నెటిజ‌న్లు కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.