నాని కూడా వారి బాటలోనే..

టాలీవుడ్లో కొంద‌రు హీరోలు రీమేక్‌ల‌కు బాగా దూరంగా ఉంటారు. అందులో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది మ‌హేష్ బాబు గురించి. హీరో అయ్యాక రెండు ద‌శాబ్దాల‌కు పైగా కెరీర్లో మ‌హేష్ ఒక్క రీమేక్‌లోనూ న‌టించ‌లేదు. ఇక ముందు కూడా న‌టించేది లేద‌ని తేల్చి చెప్పేశాడ‌త‌ను. రీమేక్‌లంటే భ‌య‌మ‌ని, ఇంకొక‌రు చేసిన క‌థ‌లో న‌టించ‌డానికి త‌న‌కు ఎగ్జైట్మెంట్ క‌ల‌గ‌ద‌ని మ‌హేష్ చెప్పాడు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం రీమేక్‌ల‌కు దూరంగా ఉండేవాడే. న‌ర‌సింహుడు మిన‌హా అత‌డి కెరీర్లో రీమేక్స్ లేవు. ఇప్పుడు నాని సైతం ఈ జాబితాలో చేరుతున్నాడు. రీమేక్‌లు త‌న‌కు సెట్ కావ‌ని.. తాను ఇక‌పై ఎప్పుడూ రీమేక్‌ల్లో న‌టించ‌న‌ని అత‌ను తేల్చి చెప్పేశాడు. ఐతే నాని ఇప్ప‌టిదాకా రీమేక్‌లు చేయ‌లేద‌నేం లేదు. భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, ఆహా క‌ళ్యాణం రీమేక్‌లే. అవి రెండూ అత‌డికి నిరాశ‌నే మిగిల్చాయి. వాటి అనుభ‌వాల‌తోనే నాని ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లున్నాడు.

ఇప్ప‌టిదాకా చేసిన రెండు రీమేక్‌లు త‌న‌కు పాఠాలు నేర్పాయ‌ని.. త‌న‌కు రీమేక్‌లు ప‌డ‌వ‌ని అర్థ‌మైంద‌ని నాని చెప్పాడు. ఒక కొత్త క‌థ కోసం తాను ఎంతైనా క‌ష్ట‌ప‌డ‌టానికి సిద్ధ‌మ‌ని.. త‌న ఆలోచ‌న విధానం రీమేక్‌ల‌కు స‌రిపోద‌ని, వాటి ప‌ట్ల త‌న‌కు ఎగ్జైట్మెంట్ క‌ల‌గ‌ద‌ని నాని అన్నాడు. అందుకే భ‌విష్య‌త్తులో కూడా రీమేక్‌లు చేయొద్ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు నాని తెలిపాడు.

తాను రీమేక్‌లు చేయ‌డం కంటే త‌న సినిమాల‌ను వేరే భాష‌ల్లో రీమేక్ చేయ‌డం త‌న‌కు బాగా అనిపిస్తోంద‌ని నాని చెప్పాడు. జెర్సీ, నిన్ను కోరి, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, నేను లోక‌ల్.. ఇలా నాని సినిమాలు చాలానే వివిధ భాష‌ల్లో రీమేక్ అయ్యాయి. ముఖ్యంగా జెర్సీ హిందీ రీమేక్ మీద అక్క‌డ భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా రిలీజ‌వుతున్న టైంలోనే నిన్ను కోరి త‌మిళ రీమేక్ కూడా విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌టం విశేషం.