ఆ సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్న రానా

ఆ సినిమాను హిందీలోకి తీసుకెళ్తున్న రానా

మిస్ గ్రానీ.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అలరించిన కొరియన్ సినిమా. హాలీవుడ్‌ను మినహాయిస్తే గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల జనాల్ని ఆకట్టుకున్న చిత్రాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. దీన్ని అనేక భాషల్లో రీమేక్ కూడా చేశారు. దాదాపుగా ప్రతి చోటా సినిమా సక్సెస్ అయింది. ఇప్పుడు తెలుగులో ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా విజయవంతం అయింది.

సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు అధికారికంగా హక్కులు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు వాళ్లే ఈ చిత్రాన్ని హిందీలోకి తీసుకెళ్లబోతుండటం విశేషం. సమంత ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెర్షన్ మంచి టాక్ తెచ్చుకుని, వసూళ్ల పరంగానూ దూసుకెళ్తుండటంతో హిందీ రీమేక్‌కు సన్నాహాలు మొదలైపోయాయి.

స్వయంగా సురేష్ బాబు తనయుడైన రానా దగ్గుబాటినే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘ఓ బేబీ’ రీమేక్ కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపాడు. హిందీ రీమేక్ తప్పకుండా ఉంటుందని.. తామే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్తామని చెప్పాడు రానా. అతడికి బాలీవుడ్ జనాలతో మంచి సంబంధాలున్నాయి. ‘బాహుబలి’ని కరణ్ జోహార్ చేతుల్లో పెట్టి ఆ సినిమా దేశవ్యాప్తంగా విస్తరించడానికి కారకుడు రానానే. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు కొన్నేళ్లుగా సొంతంగా సినిమాలు నిర్మించట్లేదు. వేరే వాళ్లు తీసిన సినిమాల్ని టేకప్ చేస్తున్నారు.

లేదంటే వేరే వాళ్ల భాగస్వామ్యంతో సినిమాలు తీస్తున్నారు. ‘ఓ బేబీ’ రెండో కోవకు చెందిన సినిమానే. హిందీలో ఏదో ఒక పెద్ద బేనర్‌తో ఒప్పందం చేసుకుని ఈ సినిమాను నిర్మించే అవకాశముంది. కంగనా రనౌత్, ఆలియా భట్ లాంటి వాళ్లు ఎవరు చేసినా ‘ఓ బేబీ’ హిందీ రీమేక్ కూడా అదిరిపోతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English