'అర్జున్ రెడ్డి' దర్శకుడు తగ్గాడు

'అర్జున్ రెడ్డి' దర్శకుడు తగ్గాడు

'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత బోల్డో.. దాని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా అంతే బోల్డ్. బయట అతను మాట్లాడేటపుడు ఆ బోల్డ్‌నెస్ తెలుస్తుంది. 'అర్జున్ రెడ్డి' ప్రి రిలీజ్ ఈవెంట్లో అతనెంత బోల్డ్‌గా మాట్లాడాడో గుర్తుండే ఉంటుంది. 'అర్జున్ రెడ్డి'ని హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసిన సందీప్.. ముంబయిలో కూడా ఏమీ తగ్గలేదు. చాలా అగ్రెసివ్‌గానే మాట్లాడాడు. ఈ సినిమాను వ్యతిరేకించిన ఫెమినిస్టులపై విరుచుకుపడ్డాడు. రిలీజ్ తర్వాత క్రిటిక్స్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా అతను ఈ సినిమాలో హీరోయిన్‌పై హీరో చేయి చేసుకోవడాన్ని, దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతున్న విమర్శకులకు పంచ్ ఇచ్చాడు. 'ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ప్రేమ ఉండదని నా అభిప్రాయం' అన్నాడు.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చిన్మయి, సమంత సహా ఎంతోమంది మహిళలు ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. బాలీవుడ్లో అయితే సందీప్‌కు వ్యతిరేకంగా ఒక ఉద్యమమే నడుస్తోంది. అతడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ వ్యవహారం పెద్ద వివాదానికి దారి తీస్తుండటంతో సందీప్ తగ్గాడు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

''నన్ను మీడియా తప్పుగా అర్థంచేసుకుంది. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ ఉండదని అన్నాను. అంటే దానర్థం రోజూ యువకుడు తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు'' అన్నాడు సందీప్. మరి ఈ వ్యాఖ్యల తర్వాత అయినా వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English