ఇండియాలో డేంజర్ బెల్స్ ?

ప్రపంచదేశాల్లో లాగే ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికి అధికారికంగా నమోదైన కేసులే 170 ఉన్నాయి. ఇంకా నిర్ధారణ కానీ, పరీక్షల దశలో ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయో తెలీదు. మొత్తానికి ఒమిక్రాన్ కేసుల తీవ్రత అయితే చాలా స్పీడుగా పెరిగిపోతోందని అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నమోదైన కేసులన్నీ మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్నాటకలోనే ఎక్కువగా ఉన్నాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా 60 కేసులు నమోదయ్యాయి. తర్వాత తెలంగాణలో 28 కేసుల వరకు బయటపడ్డాయి. అలాగే కర్ణాటక, కేరళలో కూడా చెరో 35 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్ లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా కేసుల విషయం తేలాల్సుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కన్ఫర్మ్ అయిన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికానికి ట్రావెల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటమే. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళల్లోనే ఎక్కువగా ఒమిక్రాన్ వైరస్ బయటపడుతోంది.

ఎప్పుడైతే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయో వెంటనే ప్రభుత్వాలన్నీ అలర్టవుతున్నాయి. పబ్లిక్ ప్లేసులపై ఆంక్షలు విధించటంతో పాటు నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన కూడా చేస్తున్నాయి. మాస్కు ధరించటాన్ని కంపల్సరీ చేశాయి. ఒక వైపు ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా మరోవైపు కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. మన దగ్గర ఇలాగుంటే ఐరోపా దేశాల్లో చాలా స్పీడుగా కేసులు పెరిగిపోతున్నాయి.

బ్రిటన్లో వేలాది ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అంతేకాకుండా ఒక్కరోజులోనే పదుల మరణించటం బ్రిటన్లో కలకలం రేపుతోంది. చాలా దేశాల్లో పరిస్ధితి ఇలాగే ఉంది. ఇక ఏపీలో అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇంటింటి ఆరోగ్య సర్వే మొదలుపెట్టింది. వాలంటీర్లు+ఆశా వర్కర్లను ప్రతి ఇంటికి పంపటం ద్వారా ఇంట్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తెప్పించుకుంటోంది. మరి చివరకు ఒమిక్రాన్ ఎంతటి అలజడి రేపుతుందో ఏమో చూడాల్సిందే.