ఎవ్వరూ చూడని కపిల్ ఇన్నింగ్స్‌ను చూపించబోతున్నారు

ఎవ్వరూ చూడని కపిల్ ఇన్నింగ్స్‌ను చూపించబోతున్నారు

1983 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో టైటిల్ సాధించిన భారత జట్టు.. నిజానికి గ్రూప్ దశలోనే నిష్క్రమించాల్సింది. జింబాబ్వేతో మ్యా‌చ్‌లో ఓడితే భారత్ ముందుకెళ్లేదే కాదు. ఆ మ్యాచ్‌‌ ఆరంభంలో పరిస్థితి చూస్తే భారత్‌కు ఘోర పరాజయం తప్పదనే అంతా అనుకున్నారు. కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ స్థితిలో భారత్ 100 పరుగులైనా చేస్తుందన్న నమ్మకాలు లేవు. కానీ కపిల్ దేవ్ అనే యోధుడు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియాకు ఊహించని స్కోరు నిలిచాడు. కపిల్ 175 పరుగులతో అజేయంగా నిలవగా.. భారత్ 266 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే.

ప్రపంచకప్ చరిత్రలోనే కాదు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అద్భుత ఇన్నింగ్స్. ఐతే ఇంత గొప్ప ఇన్నింగ్స్‌ను టీవీల్లో వీక్షించే భాగ్యం అభిమానులకు దొరకలేదు. దాని తాలూకు వీడియోలు కూడా ఎక్కడా దొరకవు. మ్యాచ్‌ను కవర్ చేసిన బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ఉద్యోగులు ఆ రోజు స్ట్రైక్ చేశారు. మ్యాచ్‌ను కవర్ చేయలేదు. దీంతో ప్రత్యక్ష ప్రసారం జరగలేదు. అసలు రికార్డెడ్ వీడియో కూడా ఏమీ లేకపోయింది. దీంతో కపిల్ అద్భుతాల్ని చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. ఐతే ఇప్పుడీ ఇన్నింగ్స్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కపిల్ జీవిత గాథ, 1983 ప్రపంచకప్ నేపథ్యంలో బాలీవుడ్లో ‘83’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

రణ్వీర్ సింగ్ హీరోగా ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కపిల్ అండ్ టీం నుంచి పూర్తి ఇన్ పుట్స్ తీసుకుని అతనీ సినిమా చేస్తున్నాడు. కపిల్ గ్రేట్ ఇన్నింగ్స్‌కు అతను వెండితెర రూపం ఇవ్వనున్నాడట. ఆ రోజు మ్యాచ్ నోట్స్, జట్టు సభ్యుల ఇన్ పుట్స్ తీసుకుని ఆ ఇన్నింగ్స్‌ను హైలైట్స్ రూపంలో తెరమీదికి తీసుకురానున్నాడట. ఒరిజినల్ మ్యాచ్ వీడియో చూడలేకపోయినా.. ఈ సినిమా ద్వారా అయినా కపిల్ ఇన్నింగ్స్ చూసే భాగ్యం అభిమానులకు దక్కబోతోందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English