నాకెందుకు కటౌట్ పెట్టారు-సమంత

నాకెందుకు కటౌట్ పెట్టారు-సమంత

మామూలుగా స్టార్ హీరోలకు మాత్రమే థియేటర్ల ముందు భారీ కటౌట్లు పెడుతుంటారు. ఒకప్పుడు సినిమా విడుదల సందర్భంగా ప్రతి థియేటర్ ముందు కటౌట్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంస్కృతి తగ్గిపోయింది. కొన్ని థియేటర్ల ముందు మాత్రమే.. అది కూడా పెద్ద స్టార్ హీరోలకు మాత్రమే కటౌట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక హీరోయిన్‌కు కటౌట్ పెట్టడం అరుదైన విషయమే. ఆ ఘనత దక్కించుకుంది సమంత.

తన కొత్త సినిమా ‘ఓ బేబీ’ విడుదల నేపథ్యంలో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్ దగ్గర భారీ కటౌట్ పెట్టారు సమంతకు. సూపర్ స్టార్ల రేంజిలో ఆమెకు అభిమానులు కటౌట్ పెట్టడం విశేషమే. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా సమంత కటౌట్లు కొన్ని వెలిశాయి. ఇది ఆమె స్టార్ పవర్‌కు నిదర్శనం.

ఈ విషయం తెలిసి సమంత సైతం ఆశ్చర్యపోయింది. బహుశా అక్కినేని అభిమానులే కటౌట్లు పెట్టి ఉండొచ్చని భావించి.. నాగచైతన్యకు ఫోన్ చేసిందట. ‘‘సినిమా సక్సెస్ కావడం, వసూళ్లు రావడం ముఖ్యం కానీ.. నాకెందుకు ఈ కటౌట్లు అవీ’’ అంటూ చైతూను ప్రశ్నించినట్లు సమంత చెప్పింది. సమంత నటించిన రెండో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఓ బేబీ’. దీనికి ముందు ఆమె ‘యు టర్న్’లో లీడ్ రోల్ చేసింది. ఆ సినిమా అందరూ బావుందన్నారని.. అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలే వచ్చాయని.. కానీ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడం నిరాశ పరిచిందని సమంత చెప్పింది.

ఇందుకు ఎవరినీ నిందించలేమని.. ఆ సినిమా సీరియస్‌గా సాగడంతో ప్రేక్షకులకు అంతగా రుచించలేదని.. కానీ ‘ఓ బేబీ’ ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమని.. ఇది కచ్చితంగా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English