‘అర్జున్ రెడ్డి’ రీమేక్.. మళ్లీ చెత్త బుట్టలోకేనా?

‘అర్జున్ రెడ్డి’ రీమేక్.. మళ్లీ చెత్త బుట్టలోకేనా?

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దాని హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కానీ ఇదే కథను తమిళంలో తెరకెెక్కిస్తే దాని పట్ల ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించట్లేదు. విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా ముందు లెజెండరీ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ‘వర్మ’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ దాని టీజర్, ట్రైలర్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాన్ని చెత్త బుట్టలో పడేసి.. మళ్లీ కొత్తగా సినిమా తీయాలని సంకల్పించారు.

‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన గిరీశయ్యతో మళ్లీ ‘ఆదిత్య వర్మ’ పేరుతో కొత్తగా సినిమా మొదలుపెట్టారు. దాన్ని పూర్తి చేశారు కూడా. కానీ దీని టీజర్ సైతం ఆకట్టుకోలేదు. అదే నెగెటివిటీ కంటిన్యూ అయింది.

ఈ ఏడాది ఆరంభంలో ‘వర్మ’ను పక్కన పెట్టేస్తున్న సమయంలో కొత్త వెర్షన్‌ను వేగంగా పూర్తి చేసి జూన్‌లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. అనుకున్నట్లే షూటింగ్ పూర్తయింది. కానీ ఈ సినిమాను విడుదల చేసే సాహసం చేయట్లేదు. ఈసారి టీజర్ రిలీజ్ తర్వాత కనిపించిన నెగెటివిటీ చూశాక ధ్రువ్‌ను పెట్టి ఈ సినిమా తీయడమే తప్పన్న విషయం స్పష్టమైంది. సమస్య దర్శకులతో కాదు..హీరోతోనే అనే విషయం అర్థం చేసుకున్నాక సినిమాను ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది చిత్ర బృందం.

ధ్రువ్ తండ్రి.. విక్రమ్ ఈ సినిమాను విడుదల చేసే విషయంలో ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. నిర్మాతలు అతడికి సన్నిహితులు. ‘ఆదిత్య వర్మ’ రిలీజైతే ధ్రువ్‌ కెరీర్‌కు జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువని.. ఇలాంటి సినిమాతో కెరీర్ మొదలైతే అతడిపై జనాల్లో ఒక నెగెటివ్ ముద్ర పడిపోతుందని విక్రమ్ భయపడుతున్నాడట. అసవరమైతే ఇప్పటిదాకా నిర్మాతలు పెట్టిన ఖర్చంతా తాను ఇచ్చేసి సినిమాను పర్మనెంట్‌గా ల్యాబ్‌కే పరిమితం చేసేయాలని విక్రమ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ధ్రువ్‌ను మరో సినిమా ద్వారా పరిచయం చేయడానికి అతను సన్నాహాలుు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English