బ‌న్నీకి ఐదోది.. సుకుమార్‌కు నాలుగోది

టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ పుష్ప మూవీ డివైడ్ టాక్‌తోనే భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ తొలి రోజు రూ.70 కోట్ల‌కు పైగానే గ్రాస్ క‌లెక్ట్ చేసిన‌ట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వ‌సూళ్ల మోత మోగించిన పుష్ప‌.. వేరే ప్రాంతాల్లో కూడా మంచి క‌లెక్ష‌న్లే రాబ‌ట్టింది. యుఎస్‌లో ఈ సినిమా ప్రిమియ‌ర్ల‌లో మాంచి ఊపే చూపించింది. ఆ త‌ర్వాత కూడా జోరు కొన‌సాగిస్తోంది.

గురువారం ప్రిమియ‌ర్ల‌తోనే పుష్ప హాఫ్ మిలియ‌న్ క్ల‌బ్బులోకి అడుగు పెట్టేసింది. త‌ర్వాత శుక్ర‌వారం 3 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది. శ‌నివారం ఫుల్ ర‌న్ కాక‌ముందే పుష్ప మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్బులోకి అడుగు పెట్టేసింది. శ‌నివారం ప్రి సేల్స్‌తోనే పుష్ప మిలియ‌న్ మార్కును అందుకోవ‌డం విశేషం. శనివారం పూర్తి షోలు అయ్యేస‌రికి పుష్ప 1.5 మిలియ‌న్ మార్కుకు చేరువ‌గా వెళ్లే అవ‌కాశాలున్నాయి.

ఆదివారం వ‌సూళ్లు త‌గ్గే ఛాన్సుంది. యుఎస్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు వ‌చ్చేది శ‌నివార‌మే అన్న సంగతి తెలిసిందే. ఫుల్ ర‌న్లో ఈ చిత్రం 2 మిలియ‌న్ మార్కును అందుకుంటుందో లేదో చూడాలి. అల్లు అర్జున్ కెరీర్లో ఇది ఐదో మిలియ‌న్ డాల‌ర్ మూవీ కావ‌డం విశేషం. తొలిసారి రేసుగుర్రం సినిమాతో అత‌ను ఈ క్ల‌బ్బులోకి అడుగు పెట్టాడు. ఆ త‌ర్వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, దువ్వాడ జ‌గ‌న్నాథం, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు కూడా మిలియ‌న్ మార్కును అందుకున్నాయి.

అల వైకుంఠ‌పుర‌ములో యుఎస్‌లో 3.63 మిలియ‌న్ డాల‌ర్ల‌తో నాన్ బాహుబ‌లి రికార్డును నెల‌కొల్ప‌డం విశేషం. ఇక సుకుమార్ కెరీర్లో ఇది నాలుగో మిలియ‌న్ డాల‌ర్ మూవీ. ఆయ‌న 1 నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్థ‌లం చిత్రాల‌తో వ‌రుస‌గా మిలియ‌న్ డాల‌ర్ మార్కును అందుకున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో కంటే ముందు నాన్ బాహుబ‌లి రికార్డు రంగ‌స్థ‌లందే. ఆ చిత్రం 3.5 మిలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టింది.