విజయ్ దేవరకొండదీ మహేష్ మాటే

విజయ్ దేవరకొండదీ మహేష్ మాటే

టాలీవుడ్లో చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలామంది హీరోలు ఏదో ఒక దశలో రీమేక్‌ల్లో నటించిన వాళ్లే. స్టార్ హీరోల్లో చాలా కొద్దిమంది మాత్రమే రీమేక్‌లకు దూరంగా ఉన్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఈ అరుదైన జాబితాలో చెప్పొచ్చు.

బన్నీ, తారక్ ఎప్పుడూ రీమేక్‌ల గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ.. మహేష్ మాత్రం కొన్ని సందర్భాల్లో తాను రీమేక్ సినిమా ఎప్పటికీ చేయబోనని స్పష్టంగా చెప్పాడు. రీమేక్‌లో నటించడంలో తనకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదని కూడా అతనన్నాడు. ఇప్పుడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సైతం ఇదే మాట అంటున్నాడు. తాను ఎప్పటికీ రీమేక్‌ సినిమా చేయనని అతనన్నాడు. అది తనకు ఎగ్జైట్మెంట్ ఇవ్వదని విజయ్ తేల్చేశాడు.

విజయ్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ ఆల్రెడీ రెండు భాషల్లో రీమేక్ అయింది. ఇంకో రెండు భాషల్లో రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. గత వారమే విడుదలైన హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’తో పోల్చి చూస్తున్నారు. హీరో పెర్ఫామెన్స్‌ విషయంలోనూ ఈ పోలిక నడుస్తోంది. షాహిద్ బాగా చేసినా.. విజయ్ పెర్ఫామెన్స్ మాత్రం అల్టిమేట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రీమేక్ అన్నాక ఇలాంటి పోలిక సహజమే. మరి మీరేదైనా రీమేక్ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది అని విజయ్‌ను అడిగితే.. అందుకు అవకాశమే లేదని తేల్చేశాడు విజయ్. అలాగని రీమేక్ సినిమాల్లో నటించే వాళ్ల పట్ల తనకు వ్యతిరేకత లేదని, వాళ్లను ఎంతో గౌరవిస్తానని చెప్పాడు. తన వరకు రీమేక్‌లు చేయనని, ఒకేసారి బహు భాషల్లో సినిమా మాత్రం చేస్తానని విజయ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English